హైదరాబాద్‌కు మహర్దశ..
* రూ.24 వేల కోట్లతో మెట్రో పరుగులు!
* ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బృహత్తర ప్రణాళికలు.
* 76 కిలోమీటర్ల మేర రెండో దశ మెట్రో విస్తరణ.
* ప్రైవేటు సంస్థ చేతులెత్తేయడంతో ప్రభుత్వ పరం కానున్న మెట్రో నిర్వహణ.
* దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద నుంచి టన్నెల్ నిర్మాణం.
* మూసీ వెంట 43 కిలోమీటర్ల భారీ ఎలివేటెడ్ కారిడార్.
* ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా ఇక ఒకే గొడుగు కిందకు.
* శాసనమండలిలో నగర సమగ్రాభివృద్ధి రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
చారిత్రక హైదరాబాద్ మహానగరం భవిష్యత్తులో అద్భుతమైన విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతోంది. నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, దశాబ్దాలుగా వేధిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. రోడ్ల విస్తరణ, మెట్రో రెండో దశ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం తదితర అంశాలను సభకు సవివరంగా తెలియజేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లను మూడు రకాలుగా విభజించామని, నగరం నలుమూలలా నిరంతర ప్రయాణం సాగేలా 29 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మార్గంలో మేడ్చల్, కరీంనగర్ వైపు ట్రాఫిక్‌కు ప్రధాన అడ్డంకిగా మారిన కంటోన్మెంట్ భూముల సమస్యను పరిష్కరించామని.. రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూమినిచ్చి వారి నుంచి 153 ఎకరాలు సేకరించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద నుంచి అండర్ టన్నెల్ నిర్మిస్తున్నామని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని సభకు వివరించారు. నల్గొండ చౌరస్తా జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ జూన్, జూలై నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఐటీ కారిడార్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి మహాప్రస్థానం మీదుగా రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించి పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.
హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో విస్తరణపై సీఎం సంచలన ప్రకటన చేశారు. ప్రారంభమైనప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. గత దశాబ్ద కాలంగా ఎలాంటి విస్తరణకు నోచుకోకపోవడంతో 9వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నగర శివార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాంతాలకు మెట్రోను విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మెట్రో వ్యాపారం నుంచి తాము తప్పుకుంటామని నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రకటించిన దరిమిలా.. కేంద్ర నిబంధనల మేరకు మెట్రోను పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. సుమారు రూ.24 వేల కోట్లతో 76 కిలోమీటర్ల మేర రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఎల్బీనగర్ వద్ద ఆగిపోయిన మెట్రోను హయత్‌నగర్ వరకు.. నాగోల్, చాంద్రాయగుట్ట మీదుగా ఏకంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తున్నామని తెలిపారు. అలాగే గౌలిగూడ నుంచి ఫలక్‌నుమా వరకు, అటు బీహెచ్ఈఎల్ నుంచి చందానగర్, లక్షలాది మంది పనిచేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ వరకు మెట్రో పరుగులు తీయనుందన్నారు. మరోవైపు మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గౌరవెల్లి వరకు 43 కిలోమీటర్ల మేర మూసీ నది వెంబడి భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని, దీనికి మధ్యలో వివిధ జంక్షన్ల వద్ద ట్రంపెట్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులకు కలుగుతున్న ఇబ్బందులను నివారించడానికి ‘ఆపరేషన్ రోప్’ పేరుతో ఆక్రమణలు తొలగిస్తున్నామని, కేబీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఏకంగా 783 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కోర్ అర్బన్ రీజియన్ సమగ్రాభివృద్ధి కోసం హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ కార్పొరేషన్లతో పాటు 4 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థను పటిష్టం చేసినట్లు ముఖ్యమంత్రి సభకు వివరించారు.








