24 న ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం.
* ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఇంట వివాహ వేడుకకు హాజరుకానున్న ముఖ్యమంత్రి.
* అగ్రనేతలతోనూ భేటీకి అవకాశం.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి ఇంట జరగనున్న ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు. సింఘ్వి కుటుంబంలో జరుగుతున్న ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారిక వర్గాలు షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి ఇంట జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో, తోటి పార్టీ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుక ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.








