- ద్వేషపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం
- చెప్పినట్లే బిల్లు తెస్తున్న సీఎం రేవంత్
- కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, మహా
ద్వేషపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రసర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయాలు ఇవే
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన చర్యలు తీసుకుంటారు.
2. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువైతే ఆ మొత్తం ప్రతి నెల వేతనాల నుంచి పరిహరిస్తారు. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం సమాజంలో అనేక మంది పిల్లలు తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోవడంలేదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చట్ట సభల ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల నుంచి వేతనాలను కట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు. జిల్లా కలెక్టర్కు అధికారం అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయినా మరే ఇతర కారణాలు అయితే రాష్ట్ర స్థాయిలో కమిషన్ను ఆశ్రయించవచ్చు. వృద్ధుల సంక్షేమ శాఖ ఈ చట్టాన్ని అమలు చేయనుంది. తల్లిదండ్రులను యోగక్షేమాలను పట్టించుకోకుంటే వేతనాల్లో కొత విధంచడం దేశంలో పంజాబ్ తరువాత మన రాష్ట్రంలో అమలు చేయనున్నారు.
3. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన “తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026” బిల్లును ఆమోదించిన కేబినెట్. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం.. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్ కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.
4. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదుల పై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదుల కు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
5. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను నియమించారు.
6. హైదరాబాద్ లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణబారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్ –1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది . ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
7. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేశారు. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది.







