- కేబినెట్ సంచలన నిర్ణయాలు!
- కన్నవారిని విస్మరిస్తే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత.
- విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు ఆమోదం.
- ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్‌కు గ్రీన్ సిగ్నల్.
- అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు, గిగ్ వర్కర్ల చట్టాలకు మంత్రివర్గం పచ్చజెండా.
- రోహిత్ వేముల చట్టం విధివిధానాల కోసం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ.
- జస్టిస్ సుదర్శన్ రెడ్డి కులగణన నివేదికకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
హైదరాబాద్, మహా.
ద్వేషపూరిత ప్రసంగాలు, సామాజిక అశాంతిని రెచ్చగొట్టే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లను ప్రేరేపించే ప్రసంగాలను కఠినంగా అణచివేసేందుకు వీలుగా ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు-2026’ను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పాటు సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న పిల్లల ఆట కట్టించేందుకు కేబినెట్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కన్నవారిని ఆదరించని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధుల (చట్టసభల నుంచి స్థానిక సంస్థల వరకు) నెలవారీ వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కట్ చేసి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందజేసే ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’కు ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలును వృద్ధుల సంక్షేమ శాఖ పర్యవేక్షించనుండగా, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు అధికారాలు అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. పంజాబ్ తర్వాత దేశంలో ఈ తరహా కఠిన చట్టాన్ని అమలు చేయనున్న రెండవ రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న 69 కిలోమీటర్ల ఫేజ్-1 మెట్రో వ్యవస్థను ప్రభుత్వమే పూర్తిగా స్వాదీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రుణభారంతో కలుపుకుని మొత్తం రూ.15 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లించి ప్రాజెక్టును టేకోవర్ చేసుకోవాలన్న సబ్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిధుల చెల్లింపులు, ఇతర లావాదేవీలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ను నియమిస్తూ ఆమోదముద్ర వేసింది. అలాగే, రాష్ట్రంలోని సుమారు 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల జీవితాలకు సామాజిక భద్రత కల్పిస్తూ ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్-2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ బిల్లు ద్వారా వర్కర్లకు రిజిస్ట్రేషన్, సంక్షేమ నిధి, ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానున్నాయి. గతంలో న్యాయవాద దంపతులు వామనరావు హత్యోదంతం నేపథ్యంలో రాష్ట్రంలోని న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించే దిశగా ‘తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు’కు సైతం మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో విద్యార్థులపై కుల వివక్షను సమూలంగా పారద్రోలేందుకు ఉద్దేశించిన ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని (సబ్ కమిటీ) ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వం వహించే ఈ కమిటీలో మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా నిర్వహించిన ఈ సామాజిక, ఆర్థిక, కుల సర్వే డేటా ఆధారంగా ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ రూపొందించిన తుది నివేదికను కేబినెట్ ముందు ఉంచారు. ఈ నివేదికలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం.. దీనిపై తదుపరి అధ్యయనం చేసి, అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.







