- పట్టుబడిన రూ.2.86 కోట్ల సరుకు!
- డీసీఎంలో తరలిస్తుండగా ఎస్-న్యాబ్, పోలీసుల సంయుక్త ఆపరేషన్..
- ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు.
హైదరాబాద్, మహా.
సంగారెడ్డి జిల్లాలో భారీ గంజాయి దందా రట్టయ్యింది. యువతను మత్తులో ముంచుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠా పోలీసుల వలకు చిక్కింది. జిల్లా పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఏకంగా రూ.2.86 కోట్ల విలువైన ఎండు గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో, ఈ భారీ పట్టివేత స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటంతో స్థానికులు సైతం ఉలిక్కిపడ్డారు.
పక్కా సమాచారంతో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఎస్-న్యాబ్), జిల్లా సీసీఎస్, మరియు సదాశివపేట పోలీసులు సంయుక్తంగా ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సదాశివపేట పరిధిలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు బృందాలు అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎం వాహనంతో పాటు దానికి ఎస్కార్ట్‌గా వస్తున్న కారును అడ్డగించారు. ఆ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఎండు గంజాయి గుట్టు రట్టయ్యింది. వాహనంలో సుమారు 572 కిలోల బరువున్న 286 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దొరక్కుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ప్యాక్ చేసి తరలిస్తున్నప్పటికీ పోలీసుల కళ్లుగప్పలేకపోయారు.
పట్టుబడిన ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.2.86 కోట్లు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని, దానికి పైలట్‌గా వస్తున్న ఒక కారును సీజ్ చేశారు. ఈ గంజాయిని సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, హైదరాబాద్‌తో పాటు ఇంకెక్కడికి సరఫరా చేసేందుకు ప్లాన్ చేశారు, ఈ ముఠా వెనుక ఇంకెవరున్నారు అన్న కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు







