- మెహిదీపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. మూడో అంతస్తులో పేలిన ఏసీ!
- ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన రోగులు, సిబ్బంది..
- తృటిలో తప్పిన పెను విషాదం.
హైదరాబాద్, మహా.
నగరంలోని మెహిదీపట్నం సమీపంలో ఉన్న విజయనగర్ కాలనీలో సోమవారం అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ప్రముఖ ‘శృతి మల్టీస్పెషాలిటీ’ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేషెంట్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆసుపత్రి భవనంలోని మూడో అంతస్తులో అమర్చిన ఏసీ (ఎయిర్ కండీషనర్) యంత్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ శబ్దంతో పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఏసీ పేలిన వెంటనే ఆ వార్డు చుట్టుపక్కల దట్టమైన నల్లటి పొగలు, అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి.
పెద్ద శబ్దం రావడంతో పాటు, ఒక్కసారిగా మంటలు, పొగలు కమ్ముకోవడాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనలకు గురై, ఎక్కడికక్కడ వస్తువులను వదిలేసి కిందకు పరుగులు తీశారు. అప్పటికప్పుడు రోగులను బయటకు తీసుకురావడంతో పెను ప్రాణాపాయం తప్పింది. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం మూడో అంతస్తులోకి చొరబడి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా జనం గుమికూడటంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.







