Mahaa Daily Exclusive

  క్యూనెట్ కిలాడీలపై సీసీఎస్ కొరడా..! ఏకంగా 32 మంది అరెస్ట్..! 

Share

  • ఏకంగా 32 మంది అరెస్ట్!
  • మల్టీ లెవల్ మోసాలపై ఉక్కుపాదం..
  •  భారీగా ఒప్పంద పత్రాలు, ల్యాప్‌టాప్‌ల స్వాధీనం.

హైదరాబాద్, మహా.

మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) ముసుగులో అమాయక ప్రజలకు వల వేస్తున్న ‘క్యూనెట్’ సంస్థ బాగోతం బట్టబయలైంది. పెట్టుబడుల పేరుతో ఆకర్షించి, రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తామంటూ నమ్మబలుకుతూ వందల కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ భారీ ముఠాపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కొరడా ఝుళిపించారు. గత కొంతకాలంగా అందుతున్న పక్కా సమాచారం, బాధితుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ బృందాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో క్యూనెట్ చట్టవిరుద్ధ వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఏకంగా 32 మంది కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

ఈ సోదాల్లో దర్యాప్తునకు అత్యంత కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఉపయోగించిన నకిలీ ఒప్పంద పత్రాలు, చట్టవిరుద్ధమైన లావాదేవీల రికార్డులు, ఖాతాదారుల వివరాలు ఉన్న భారీ సంఖ్యలో ల్యాప్‌టాప్‌లతో పాటు పలు ఇతర వస్తువులను సీజ్ చేశారు. ప్రజల ఆశను, అత్యాశను ఆసరాగా చేసుకుని, చైన్ సిస్టమ్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరిని ఈ ఊబిలోకి ఎలా దించారో ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఈ 32 మంది నెట్‌వర్క్ ఏజెంట్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో అమాయకులను మభ్యపెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల మోడస్ ఆపరెండీ (నేర శైలి)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారికంగా వెల్లడించనున్నారు. త్వరలోనే ఆయన మీడియాతో మాట్లాడి క్యూనెట్ కేసు పూర్వాపరాలు, ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, దారి మళ్లించిన నిధుల వివరాలను బహిర్గతం చేయనున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో ఇలాంటి మోసపూరిత సంస్థల వలలో పడొద్దని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.