- .కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?
- ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలకు వంచన.
- హామీల అమలుపై మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి.
- రాష్ట్ర మంత్రులకు భాజపా నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్..
హైదరాబాద్, మహా.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, కేటాయింపులపై ఎలాంటి వేదికపైనైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ మంత్రులకు ఆ దమ్ము ఉందా అని భారతీయ జనతా పార్టీ (భాజపా) శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రులు పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమాన్ని గాలికొదిలేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహిళల కోసం ఈ ప్రభుత్వం గత కాలంగా ఏం చేసిందో రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు.. విపక్షాలు, ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా దాటవేసే ధోరణి అవలంబించడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. హామీల అమలు సాధ్యం కాకనే కేంద్రంపై నెపం నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.







