Mahaa Daily Exclusive

  రైలు ప్రయాణికులకు తీపి కబురు..! 72 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్..! 

Share

  • 72 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్!
  • 8 గంటల్లోపు రద్దు చేస్తే ఒక్క పైసా రాదు.
  • టికెట్ల రద్దు నిబంధనల్లో రైల్వే శాఖ కీలక మార్పులు.

హైదరాబాద్, మహా.

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ టికెట్ల రద్దు (క్యాన్సిలేషన్), రీఫండ్ నిబంధనల్లో చారిత్రాత్మక మార్పులు చేపట్టింది. ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు, చివరి నిమిషంలో టికెట్లను రద్దు చేసుకునే ధోరణిని అరికట్టేందుకు ఈ సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణికుడు తన ప్రయాణ సమయానికి కనీసం 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే, అతనికి టికెట్ ధరలో ఒక్క రూపాయి కూడా కోత పడకుండా వంద శాతం రీఫండ్ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలతో పోలిస్తే ఇది ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే, ప్రయాణ సమయం దగ్గరపడే కొద్దీ రీఫండ్ మొత్తంలో కోతలు పడుతూ ఉంటాయి.

అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే.. ప్రయాణ సమయానికి కేవలం 8 గంటల లోపు టికెట్‌ను రద్దు చేసుకున్నట్లయితే, సదరు ప్రయాణికునికి రైల్వే శాఖ నుంచి ఎలాంటి రీఫండ్ లభించదు. అంటే టికెట్ సొమ్మును పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రయాణ సమయానికి 72 గంటల నుంచి 8 గంటల మధ్యలో రద్దు చేసుకుంటే, సమయం తగ్గే కొద్దీ వాపస్ ఇచ్చే సొమ్ము కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. టికెట్ల రద్దుతో పాటు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే నిబంధనల్లో కూడా రైల్వే శాఖ పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈ సవరణలు చేసినట్లు సమాచారం. సవరించిన ఈ కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా దశలవారీగా అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి, తమ ప్రయాణ ప్రణాళికలను ముందే ఖరారు చేసుకోవాలని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.

Latest