Mahaa Daily Exclusive

  కోటి మంది భారతీయుల భద్రతే మా ప్రాధాన్యం..! రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

Share

  • పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నాం.
  •  గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.
  •   ముడిచమురు, గ్యాస్‌, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు.
  •   రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

 

న్యూఢిల్లీ, మహా.

 

పశ్చిమాసియాలో మూడు వారాలుగా ఎగిసిపడుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతుండగా, భారతదేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. మంగళవారం రాజ్యసభ వేదికగా ఆయన చేసిన ప్రకటన దేశంలోని ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాకుండా, ఈ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థను కుదిపేస్తోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన సుమారు కోటి మంది భారతీయుల భద్రత, వారి జీవనోపాధిని కాపాడటమే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులు దాటినా పరిస్థితులు సద్దుమణగకపోగా, ఇంధన సంక్షోభం వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన విశ్లేషించారు.

సముద్ర వాణిజ్యానికి జీవనాడి వంటి హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభనపై ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌కు వచ్చే ముడిచమురు, సహజ వాయువు నౌకలన్నీ ఈ మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుందని, ప్రస్తుతం అక్కడ అనేక నౌకలు నిలిచిపోవడం భారత్‌కు శరాఘాతంగా మారిందని పేర్కొన్నారు. ఆ నౌకల్లో చిక్కుకున్న సిబ్బందిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడటమే కాకుండా, దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటి ఎరువుల దిగుమతులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని మోదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాలో జాప్యం జరిగితే దేశీయంగా నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని, అందుకే ఈ సంక్షోభాన్ని జాతీయ సమస్యగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, గల్ఫ్ దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని సభకు భరోసా ఇచ్చారు. యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని, ఇప్పటికే పలు దౌత్య మార్గాల ద్వారా వారి తరలింపు ప్రక్రియను ముమ్మరం చేశామని వెల్లడించారు. క్లిష్ట సమయంలో దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు, వర్గాలు విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇంధన వనరుల కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని, రవాణా మార్గాల్లో భద్రత కల్పించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తున్నామని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

Latest