Mahaa Daily Exclusive

  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి..! జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ..

Share

  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి
  • పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
  • వారి పోరాటాలకు మా సంపూర్ణ మద్దతు
  • జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ

హైదరాబాద్, మహా : జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని రెండున్నరేళ్లు అయినా జర్నలిస్టుల సమస్యలు ఒక్కటి తీర్చలేదని, వారి పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. బుధవారం జర్నలిస్టులు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి తమ పార్టీ సంఘీభావం తెలుపుతుందని మంగళ వారం కేఎస్ఆర్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్ళు గడిచిపోయిందని, జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు జర్నలిస్టులు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర చాలా కీలకం అని, జర్నలిస్టుల గురించి ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి మంత్రిగా ఉండటం తమ దౌర్భాగ్యమని జర్నలిస్టులు భావిస్తున్నారని కేఎస్ఆర్ గౌడ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 వేల మంది జర్నలిస్టులున్నారని, వీరిలో అత్యధిక శాతం కడు పేదరికంలో మగ్గుతున్నారని, వేతనాలు లేక అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, చాలా మంది అనారోగ్యంతో వైద్యం చేయించుకునే ఆర్ధికస్థోమత లేక మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిడేషన్లు ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నెలకు 25 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కేఎస్ఆర్ గౌడ డిమాండ్ చేశారు.

Latest