- ఫార్ములా ఈ-రేస్ చార్జ్‌షీట్‌లో ఏమీ లేదు.. అంతా తుస్సు.
- రూ. 45 కోట్లకు రూ. 600 కోట్లా? అసత్య ప్రచారాలపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్!
- అనుచిత లబ్ధి పొందిన వారెవరు? చార్జ్‌షీట్‌లో పేర్లేవీ?
- అది విధానపరమైన లోపం మాత్రమే.. అవినీతి కాదు.
- ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే చార్జ్‌షీట్ డ్రామా.
- కేటీఆర్ విమర్శల దాడి!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ చార్జ్‌షీట్ విడుదల వెనుక ఉన్న సమయపాలనను ఆయన ప్రశ్నిస్తూ, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని కొట్టిపారేశారు. శాసనసభలో ఆరు గ్యారంటీలపై తాము ప్రైవేటు బిల్లు పెట్టిన రోజే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఈ-రేస్ చార్జ్‌షీట్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, లీకులతో హడావుడి చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన విఫల హామీల నుంచి తప్పించుకోవడానికే ఇటువంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్వయంగా ప్రభుత్వ చార్జ్‌షీట్ ద్వారానే స్పష్టమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో పసలేదని, ఏమీ లేదని ప్రభుత్వం మళ్లీ ఒప్పుకున్నట్లయిందని ఆయన సెటైర్లు వేశారు. గతంలో ఈ రేసు నిర్వహణ కోసం భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మాత్రం ఆ విషయాన్ని నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. నిధుల విషయంలో ప్రభుత్వం చెబుతున్న అంకెలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాస్తవానికి తాము కట్టింది కేవలం రూ. 45 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రూ. 500 నుంచి 600 కోట్లు అంటూ కట్టుకథలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఎవరికి అనుచిత లబ్ధి చేకూర్చామని ఆరోపిస్తున్నారో, కనీసం వారి పేర్లు కూడా చార్జ్‌షీట్‌లో లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేవలం ఊహజనిత ఆరోపణలతో చార్జ్‌షీట్‌ను నింపారని, ఎవరికి లాభం చేకూరిందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రభుత్వం సమర్పించిన వివరాలను బట్టి చూస్తే, అందులో ఎక్కడా అవినీతి ఛాయలు కనిపించడం లేదని, కేవలం విధానపరమైన లోపం ఉన్నట్లు మాత్రమే తెలుస్తోందని ఆయన విశ్లేషించారు. ఏదైనా ఒక ప్రాజెక్టును అమలు చేసే క్రమంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని, వాటిని అవినీతిగా చిత్రీకరించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం తాము ఎంతో కష్టపడి ఫార్ములా ఈ-రేస్‌ను తీసుకువచ్చామని, దానిని అప్రతిష్ఠా పాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తాము ఎటువంటి విచారణకైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు. అయితే అబద్ధపు ప్రచారాలు, లీకులతో రాజకీయం చేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పలేకనే ఈ-రేస్ చార్జ్‌షీట్‌ను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని, కానీ అందులోనూ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని కేటీఆర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.






