- ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం.
- ప్రపంచంలో 6వ స్థానంలో భారత్.. పాకిస్థాన్ టాప్!
- యూపీలోని లోనీ పట్టణమే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం.
- టాప్-10లో ఐదు నగరాలు మనవే!
- రాజధాని దిల్లీలో ప్రాణాంతక గాలి.
- అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 4వ స్థానం!
- డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు గాలికి.
- పీఎం 2.5 మోతాదుతో పెరుగుతున్న ప్రాణగండం!
- గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ నిలిపివేతతో డేటా కరువు!
హైదరాబాద్, మహా ప్రత్యేకం.అభివృద్ధి పరుగులో పర్యావరణాన్ని విస్మరిస్తున్న మానవాళికి స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఐక్యూఎయిర్’ సంస్థ విడుదల చేసిన ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ – 2025’ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కోరలు చాస్తోందని, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం అనేది ఇప్పుడు ఒక విలాసంగా మారుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 143 దేశాల్లోని 9,446 నగరాల వాయు నాణ్యతను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో భారత్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అత్యంత కాలుష్యమయ దేశాల జాబితాలో పొరుగున ఉన్న పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ ఆరో స్థానంలో నిలిచింది. గాలిలో ప్రాణాంతకమైన పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) మోతాదు ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయించారు. బంగ్లాదేశ్, తజికిస్తాన్, చాద్, కాంగో దేశాలు వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశం తలదించుకునేలా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయ నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ సమీపంలో ఉన్న ‘లోనీ’ పట్టణం నిలిచింది. ఇక్కడ గాలిలో పీఎం 2.5 మోతాదు క్యూబిక్ మీటర్‌కు ఏకంగా 112.5 మైక్రోగ్రామ్స్ ఉన్నట్లు నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఏకంగా 22 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ప్రపంచంలోని టాప్-10 కాలుష్య నగరాల్లో ఐదు నగరాలు భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లోనీ (యూపీ), బైర్నీహట్ (మేఘాలయ), దిల్లీ, గాజియాబాద్ (యూపీ), ఉలా-బిర్హ్ నగర్ (పశ్చిమ బెంగాల్) నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత రాజధాని దిల్లీ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 4వ స్థానంలో నిలవడం రాజధాని వాసుల ఆరోగ్య భద్రతపై ప్రశ్నార్థకంగా మారింది. టాప్-25 కాలుష్య నగరాలన్నీ కేవలం భారత్, పాకిస్థాన్, చైనాలలోనే కేంద్రీకృతమై ఉండటం ఆసియా ఖండానికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పును సూచిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన గాలి నాణ్యతా ప్రమాణాలను కేవలం 13 దేశాలు, ప్రాంతాలు మాత్రమే అందుకోగలిగాయని నివేదిక తేల్చిచెప్పింది. ఫ్రెంచ్ పోలీనేషియా, ప్యుయెర్టో రికో, బార్బడోస్, ఆస్ట్రేలియా, ఎస్టోనియా వంటివి ఈ స్వచ్ఛమైన జాబితాలో ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో సంభవించిన కార్చిచ్చు ఘటనలు ప్రపంచ గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీశాయి. అమెరికాలో గాలి నాణ్యత క్షీణించి పీఎం 2.5 సగటు 7.3 మైక్రోగ్రామ్స్‌కు చేరుకుంది. అయితే అమెరికాలోని సియాటెల్ నగరం మాత్రం వరుసగా రెండో ఏడాది అత్యంత స్వచ్ఛమైన నగరంగా నిలిచింది. మరోవైపు సహారా ఇసుక తుఫానుల వల్ల స్విట్జర్లాండ్, గ్రీస్ దేశాల్లో కాలుష్యం 30 శాతం పెరిగింది.
**ట్రంప్ నిర్ణయంతో తగ్గిన పర్యవేక్షణ**
గాలి నాణ్యతను అంచనా వేయడంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం’ను నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీల ద్వారా అమలయ్యే ఈ ప్రోగ్రాం ఆగిపోవడంతో, మార్చి 2025 నుంచి గాలి నాణ్యతపై నిర్దిష్టమైన డేటా సేకరణ కష్టంగా మారింది. దీనివల్ల 44 దేశాల్లో పర్యవేక్షణ తగ్గిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఆందోళన వ్యక్తం చేసింది. సరైన గణాంకాలు ఉంటేనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టగలమని ఐక్యూఎయిర్ సంస్థ సీఈఓ ఫ్రాంక్ హ్యామ్స్ అభిప్రాయపడ్డారు. గాలిలోని అతిసూక్ష్మ కాలుష్య కారకాలైన పీఎం 2.5 నేరుగా రక్తంలోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయని, దీనిపై ప్రభుత్వాలు తక్షణమే మేల్కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






