Mahaa Daily Exclusive

  నేతన్నను ఆదుకోండి..! సిరిసిల్లపై రూ.38 కోట్ల విద్యుత్ పిడుగు..

Share

  • సిరిసిల్లపై రూ.38 కోట్ల విద్యుత్ పిడుగు..
  •  బకాయిలు మాఫీ చేయాలని విన్నపం.
  •  ఆత్మహత్యల బాట పట్టకముందే ఆదుకోవాలి.
  •  ఉపముఖ్యమంత్రి భట్టి, తుమ్మలతో కేటీఆర్ భేటీ.

హైదరాబాద్‌:

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విన్నవించారు. ఎమ్మెల్సీ ఎల్. రమణతో కలిసి ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఆయన, నేతన్నల సమస్యలపై సమగ్రమైన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా 2016 నుంచి 2024 వరకు 127 చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి అధికారులు విధించిన ‘బ్యాక్ బిల్లింగ్’ భారం సుమారు రూ.19 కోట్లుగా ఉందని, దానికి సర్‌ఛార్జీలు తోడవ్వడంతో అది ఇప్పుడు రూ.38 కోట్లకు చేరిందని కేటీఆర్ వివరించారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్తోమత లేక అనేక యూనిట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని, తక్షణమే ఈ బకాయిలను మాఫీ చేసి వస్త్ర పరిశ్రమకు ఊపిరి పోయాలని కోరారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్సిడీ పరిమితిని 25 హెచ్‌పీ (HP) వరకు పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విధిస్తున్న నిబంధనలు నేతన్నలను మళ్లీ ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని, కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని విన్నవించారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలించక, మరోవైపు విద్యుత్ భారంతో నేతన్నలు సతమతమవుతున్నారని, గతంలో మాదిరిగా మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకముందే ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం దృష్ట్యా ఈ బకాయిలను రద్దు చేసే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని భట్టి విక్రమార్కను కోరారు.

అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా కలిసిన కేటీఆర్, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న అంశాలపై చర్చించారు. వస్త్ర పరిశ్రమ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, వేల కుటుంబాలకు అది జీవనాధారమని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో విడుదల కాకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలు పరిశ్రమను కుదేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రూ.38 కోట్ల విద్యుత్ భారాన్ని రద్దు చేయడమే కాకుండా, నేతన్నలకు భరోసా ఇచ్చేలా ప్రత్యేక ప్యాకేజీ లేదా రాయితీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ విన్నపాలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Latest