Mahaa Daily Exclusive

  ఫిరాయింపుల వేళ హైకోర్టు కీలక నిర్ణయం..! తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చ..

Share

  • ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు.
  •  స్పీకర్‌ తీర్పుపై న్యాయస్థానంలో సవాల్‌.
  •  వచ్చే నెల 16కు విచారణ వాయిదా.
  •  కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం.
  •  తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చ.

హైదరాబాద్‌:మహా.

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు శాసనసభ స్పీకర్‌కు కూడా నోటీసులు పంపిన న్యాయస్థానం, ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, వారు సాంకేతికంగా తమ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పీకర్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పక్షం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ప్రధానంగా దానం నాగేందర్‌, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్‌ గౌడ్, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, బండ్ల కృష్ణమహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు, వారి వాదనలను కౌంటర్‌ అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అధికార పార్టీ కండువాలు కప్పుకున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ స్పీకర్‌ కార్యాలయం నుంచి వెలువడిన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్‌ఎస్‌ నేతలు గట్టిగా వాదించారు.

ఈ పిటిషన్లపై ప్రాథమిక విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రతివాదులందరికీ తమ వాదనలను వినిపించే అవకాశం కల్పిస్తూ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. స్పీకర్‌ ఇచ్చిన తీర్పు కాపీని, దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ నిర్ణయాలపై న్యాయ సమీక్ష పరిధిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉన్నందున, తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా ఎమ్మెల్యేలు మరియు స్పీకర్‌ కార్యాలయం దాఖలు చేసే కౌంటర్‌ సమాధానాలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారనున్నాయి. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో అధికార, ప్రతిపక్షాల మధ్య చట్టపరమైన పోరాటం మరింత తీవ్రం కానుంది.

Latest