మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పెను సంచలనం.
* జూబ్లీహిల్స్ డాక్టర్ అరెస్ట్ .
* వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు
హైదరాబాద్, మహా.
తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ , కాల్పుల కేసు దర్యాప్తులో రోజుకో విస్మయకర పరిణామం వెలుగులోకి వస్తోంది. సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఈ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధమున్న కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలాజీ కేవలం ఒక వైద్యుడిగానే కాకుండా, తన విలాసవంతమైన నివాసాన్ని మత్తు విందులకు వేదికగా మార్చినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ నివాసాన్ని ఒక రహస్య ‘డెన్’గా వాడుకుంటూ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ప్రతి నెలా అక్కడ డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవారని పోలీసుల విచారణలో తేలింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలాజీ నివాసంపై దాడి చేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను కూడా మత్తు పదార్థాలు సేవించినట్లు సదరు వైద్యుడు అంగీకరించాడు.
ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న గొలుసుకట్టు సంబంధాలను ఛేదిస్తున్న క్రమంలో, డ్రగ్ పెడ్లర్ రాకేశ్ వర్మ పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది. రాకేశ్ వర్మ ద్వారానే డాక్టర్ బాలాజీకి ఎండీఎంఏ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలు సరఫరా అయ్యేవని, అక్కడి నుంచే అవి రోహిత్ రెడ్డికి చేరేవని అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం రాకేశ్ వర్మ రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బాలాజీ అరెస్టుతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు చేరింది. దర్యాప్తు ముమ్మరం కావడంతో పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ వంటి మరికొందరు పెడ్లర్ల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. రెండో రోజు కస్టడీ విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి మరియు దిల్లీ వ్యాపారి నమిత్ శర్మలను విచారించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డికి గత ఐదేళ్లుగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఇందుకు సంబంధించి గతంలోనూ పలు కేసుల్లో అతని పేరు వినిపించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
కేసులో మరో కీలకమైన అంశం శాస్త్రీయ ఆధారాలు. ఈ నెల 14న మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో నిందితులు కేవలం ఒకే రకమైన డ్రగ్ కాకుండా, వివిధ రకాల మత్తు పదార్థాలను కలిపి వాడినట్లు ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి. మద్యం సేవించే క్రమంలో అందులోనే కొకైన్ మరియు ఎండీఎంఏలను కలిపి తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు కొకైన్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దిల్లీ వ్యాపారి నమిత్ శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ మరియు కొకైన్ ఉన్నట్లు తేలింది. అదేవిధంగా టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు నిర్వహించిన పరీక్షల్లో సైతం యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఉన్నట్లు ఫలితాలు రావడం కలకలం రేపుతోంది. డాక్టర్ బాలాజీకి, ఎంపీ పుట్టా మహేశ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తిస్థాయి తుది నివేదికలు రాగానే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.







