- భాగ్యనగరంలో ఇంధన పానిక్.
- సోషల్ మీడియా పుకార్లపై పోలీస్ కమిషనర్ హెచ్చరిక.
- 186 బంకులపై పోలీసుల నిఘా.
- కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.
- సీపీ సజ్జనార్.
హైదరాబాద్:మహా.
నగరంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సాగుతున్న అసత్య ప్రచారాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఇంధన నిల్వలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని, ప్రజలెవరూ వీటిని నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చమురు సంస్థల వద్ద ప్రస్తుతానికి సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే అశాంతి సృష్టించేందుకు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
నగరవ్యాప్తంగా ఉన్న 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పోలీసులు నిరంతరం సమీక్షిస్తున్నారని సీపీ వెల్లడించారు. బంకుల వద్ద అనవసరంగా రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు తమ సాధారణ అవసరాల కంటే ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. “ముందుజాగ్రత్త” పేరుతో వాహనదారులు ఒకేసారి బంకులకు పోటెత్తడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బంకుల యాజమాన్యాలు కూడా నిల్వలు ఉంచుకుని లేవని చెప్పినా, లేదా అధిక ధరలకు విక్రయించి కృత్రిమ కొరత సృష్టించినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వ్యక్తులపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టిందని కమిషనర్ తెలిపారు. కేవలం లైకులు, షేర్ల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడితే సహించేది లేదని, అలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన జంక్షన్లలోని బంకుల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఇంధన సరఫరా నిరాటంకంగా సాగుతోందని, ఏ ప్రాంతంలోనూ కొరత లేదని ప్రభుత్వం మరియు చమురు సంస్థలు ధృవీకరించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అత్యవసరమైతే డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.







