- తెలంగాణలో ‘కోడి’ కూత బంద్!
- ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్.
- మాంసం ప్రియులకు ‘గడ్డు’ కాలం!
- ధరల సెగ.. సమ్మె బాటలో చికెన్ వ్యాపారులు.
- రాష్ట్రవ్యాప్తంగా విక్రయాల నిలిపివేత.
- కంపెనీల దోపిడీపై వ్యాపారుల సమరం..
హైదరాబాద్:మహా.
తెలంగాణలో మాంసం ప్రియులకు గడ్డు కాలం రాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చికెన్ షాపులను నిరవధికంగా మూసివేయాలని చికెన్ షాపుల యజమానుల అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు (ఇంటిగ్రేటర్లు) ఇష్టారాజ్యంగా పెంచుతున్న హోల్ సేల్ ధరలకు నిరసనగా, తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వేలాది రిటైల్ షాపులు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులకు చికెన్ దొరకడమే కాకుండా, హోటల్ , రెస్టారెంట్ పరిశ్రమపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది.
ఈ నిరసనకు ప్రధాన కారణం భారీ పౌల్ట్రీ కంపెనీల గుత్తాధిపత్యమని వ్యాపారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కోడి పిల్లలు, మేత ధరలు పెరిగాయనే నెపంతో కంపెనీలు హోల్ సేల్ ధరలను అమాంతం పెంచుతున్నాయని, అయితే రిటైల్ వ్యాపారులకు ఇచ్చే కమీషన్ మాత్రం దశాబ్దాలుగా మార్పు లేకుండా అలాగే ఉందని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, పనివాళ్ల జీతాలు మరియు ఇతర నిర్వహణ ఖర్చుల దృష్ట్యా, కంపెనీలు నిర్ణయించే మార్జిన్లతో వ్యాపారం చేయడం సాధ్యం కాదని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కిలో చికెన్‌పై తమకు వచ్చే కమీషన్‌ను గణనీయంగా పెంచాలని లేదా కంపెనీలే విక్రయ ధరలను నియంత్రించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అసోసియేషన్ నాయకులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రతినిధులతో సమావేశమై ఈ నిర్ణయానికి మద్దతు కూడగట్టారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని, మధ్యతరగతి వ్యాపారులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి గానీ, కంపెనీల నుంచి గానీ సానుకూల స్పందన రాకపోతే ఏప్రిల్ 1 నుంచి ఒక్క షాపు కూడా తెరవబోమని భీష్మించుకు కూర్చున్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి సమరానికి సిద్ధమయ్యారు. ఈ ఆకస్మిక పరిణామంతో ఆదివారం నాడు విందు వినోదాలు చేసుకునే సామాన్యులు , చికెన్ వ్యాపారంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.







