Mahaa Daily Exclusive

  అబ్బబ్బే..! నేనే తప్పు చేయలేదు..ఆ డ్రగ్స్ టెస్టులో నెగటివ్ రిపోర్టులు వచ్చాయి..

Share

  • ఆ డ్రగ్స్ టెస్టులో నెగటివ్ రిపోర్టులు వచ్చాయి
  • పార్టీ అధిష్టానానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నివేదిక

 

అమరావతి, మహా : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ అధిష్టానానికి తన వివరణ సమర్పించారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ అధిష్టానానికి పూర్తి వివరాలతో వివరణ సమర్పించారు. ఎంపీ అందజేసిన సీల్డ్ కవర్ నివేదికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుంచారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం దురదృష్టవశాత్తూ తప్పుడు సమయంలో, తప్పుడు ప్రదేశంలో ఉండటం వల్లే వివాదాల్లో చిక్కుకున్నానని ఆయన తన వివరణలో పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు మహేష్ యాదవ్ కీలక ఆధారాలను పార్టీకి అందజేశారు. ఘటన జరిగిన తర్వాత మార్చి 16వ తేదీన తాను స్వచ్ఛందంగా విజయ, విపార్థ్, యోధ డయాగ్నోస్టిక్స్ వంటి ప్రముఖ ల్యాబ్‌లలో డ్రగ్ టెస్టులు చేయించుకున్నానని, ఆ రిపోర్టులలో నెగెటివ్ వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీ జరిగిన రోజు మొయినాబాద్ పోలీసులు తన వద్ద ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోలేదని, పార్టీ ఆదేశాల మేరకే ఇప్పటివరకు తాను ఈ అంశంపై మౌనంగా ఉన్నానని ఆయన వివరించారు.

 

పుట్టా మహేష్ యాదవ్ సమర్పించిన ఈ వివరణపై లోతైన విచారణ జరపాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఎంపీ ఇచ్చిన రిపోర్టులు, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి (నిజనిర్ధారణ చేసి), పూర్తి వివరాలతో కూడిన నివేదికను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సమర్పించాలని పల్లా శ్రీనివాసరావుకు లోకేశ్ సూచించారు. త్వరలోనే ఈ వ్యవహారంపై పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ..

 

కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు జరిపిన దాడిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సహా పలువురు పట్టుబడ్డారు. పుట్టా మహేష్, రోహిత్ రెడ్డిలతో పాటు మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు. ఈగల్ టీం ఎస్పీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ సహా 8 మందికి పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్ శర్మలను అరెస్ట్ చేయగా 2 వారాల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.

 

తెలంగాణ ప్రభుత్వ జోక్యం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి

 

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట స్పందించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ పుట్టా మహేష్‌కు పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు ఇప్పటికే ‘సిట్’ ఏర్పాటు చేశామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని, రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.

Latest