- విభజన రాజకీయాలా?..
- మహిళా రిజర్వేషన్ల బిల్లు చింపిన
- వారితోనే మీ దోస్తీనా?* కేంద్ర మంత్రి ధ్వజమెత్తు.
- దక్షిణాదికి అన్యాయమంటూ కొత్త డ్రామా.
- ఓటమి భయంతోనే ‘వివక్ష’ వ్యాఖ్యలని విమర్శ.
- రేవంత్‌పై బండి సంజయ్ నిప్పులు!
హైదరాబాద్: మహా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ‘దక్షిణాది వివక్ష’ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచినప్పుడు అభ్యంతరం ఎందుకని, ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, ఆయనలో దేశభక్తి, జాతీయ వాదం మచ్చుకైనా కనిపించడం లేదని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోతుందనే వణుకు రేవంత్ రెడ్డిలో మొదలైందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడ కాంగ్రెస్ పాచికలు పారవని అర్థమయ్యాకే ‘దక్షిణాదికి అన్యాయం’ అనే కొత్త డ్రామాను రేవంత్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. తమిళనాడు, కేరళ ప్రజలు విజ్ఞులని, విభజన రాజకీయాలు చేసే వారికి కర్రుకాల్చి వాత పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ఉన్న ద్వేషం మరోసారి బయటపడిందని ఆయన ధ్వజమెత్తారు.
గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వలేదని, నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో రేవంత్ రెడ్డి అంటకాగుతున్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ల ద్వేషులతో జతకట్టిన రేవంత్ రెడ్డికి మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, విభజన రాజకీయాలకు పాల్పడినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడటం మానుకోవాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని హితవు పలికారు.







