Mahaa Daily Exclusive

  వదంతులు నమ్మొద్దు..! రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Share

  • వదంతులు నమ్మొద్దు.
  •  రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు.
  •  డిమాండ్‌ కంటే సరఫరానే అధికం.
  •  భాగ్యనగరంలో 596 బంకులు ఫుల్‌ క్లోజ్‌ కావు!
  •  క్యాన్లలో పెట్రోల్‌ తీసుకెళ్తే కఠిన చర్యలు.
  •  1,200 అదనపు ట్యాంకర్లతో రవాణా ముమ్మరం.
  •  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

హైదరాబాద్‌:మహా.

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ మరియు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అత్యంత స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా , మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో వచ్చే రెండు నెలల వరకు ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాల కారణంగా ఒక్కసారిగా డిమాండ్ 25 శాతం పెరిగినప్పటికీ, ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ముందస్తు చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 17,246 కిలోలీటర్ల ఇంధన డిమాండ్ ఉండగా, అంతకంటే ఎక్కువగా 17,898 కిలోలీటర్లను సరఫరా చేశామని గణాంకాలతో సహా వెల్లడించారు. సాధారణ సగటు కంటే 22 శాతం అదనంగా సరఫరా కొనసాగుతోందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా 16,000 కిలోలీటర్ల బఫర్ స్టాక్‌ను కూడా సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు.

నగరంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్న ‘నో స్టాక్’ బోర్డులపై మంత్రి స్పందిస్తూ, అది ఇంధనం లేక కాదని, కేవలం ట్యాంకర్లు చేరుకోవడంలో జరుగుతున్న స్వల్ప జాప్యం వల్ల మాత్రమేనని వివరించారు. రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు అదనంగా 1,200 ట్యాంకర్లను రంగంలోకి దించామని, ప్రతి బంకుకు సకాలంలో సరఫరా అందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని 596 పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ఏ ఒక్క బంకును కూడా మూసివేయడానికి ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పెట్రోల్ దొరకదనే భయం అనవసరమని, ఓఎన్జీసీ ద్వారా నిరంతర సరఫరా కొనసాగుతోందని, వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా 60 నుంచి 65 రోజులకు సరిపడా ఉన్నాయని తెలిపారు.

ప్రజలు ఆందోళనతో క్యాన్లు, డబ్బాల్లో పెట్రోల్ మరియు డీజిల్ నింపుకుని వెళ్లడంపై మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలా బహిరంగంగా క్యాన్లలో ఇంధనాన్ని తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరమే కాకుండా చట్టవిరుద్ధమని, అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. అలాగే గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు కూడా సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. కమర్షియల్ సిలిండర్ల అక్రమ మార్పిడిపై ఇప్పటికే దాడులు నిర్వహించి 2,952 సిలిండర్లను సీజ్ చేశామని గుర్తు చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, కేవలం సాధారణ అవసరాలకు మించి ఇంధనాన్ని నిల్వ చేసి కృత్రిమ కొరతకు కారణం కావొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Latest