Mahaa Daily Exclusive

  మమత మమకారం వీడింది.. పుట్టింట్లోనే వివాహిత ఆత్మహత్య..!

Share

  •  పుట్టింట్లోనే వివాహిత ఆత్మహత్య!
  •  కట్నం కాటుకు మరో బలి?
  • కన్నవారి చెంతనే అనంత వాయువుల్లో కలిసిన మమత.
  • వేధింపులు భరించలేకేనని తల్లిదండ్రుల ఆరోపణ

రామాయంపేట , మహా.

కన్నవారి చెంతనైనా కష్టాలు తీరుతాయని, పుట్టిల్లు తనను ఆదరిస్తుందని నమ్మిన ఆ వివాహిత.. చివరకు అక్కడే తనువు చాలించింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మమత (25) అనే వివాహిత తన పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించి పంపిన కూతురు, ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన నాటి నుంచి మమత అత్తింటి వారి వేధింపులను ఎదుర్కొంటోంది. అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు ఆమెను శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నారని మమత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేధింపులు మితిమీరడంతో కొన్ని రోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. అయినప్పటికీ అత్తింటి వారి వేధింపుల సెగ ఆమెను వదిలిపెట్టలేదని, ఆ మనస్తాపంతోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని కన్నీరుమున్నీరవుతున్నారు. “మా బిడ్డను కట్నం కోసం పొట్టనబెట్టుకున్నారు” అంటూ వారు పోలీసులకు మొరపెట్టుకున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న రామాయంపేట పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మమత మృతితో డి.ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే ఒక నిండు ప్రాణం బలవనంతంగా బలైపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest