Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో ‘ఇప్ప’ సెగ..! ఇందిరమ్మ పేరుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ..!

Share

  • అసెంబ్లీలో ‘ఇప్ప’ సెగ.
  • ఇందిరమ్మ పేరుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ!
  • ఇప్ప సారా ‘ఆర్గానిక్ విస్కీ’.
  • కానీ ఆ పేరు మాత్రం పెట్టొద్దు: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.
  • మమతలకు అపచారం.. ఇందిరమ్మ మా దేవత.
  • బీజేపీ ఎమ్మెల్యేపై మంత్రుల ధ్వజం

హైదరాబాద్‌,మహా.

తెలంగాణ శాసనసభలో బుధవారం ‘ఇప్ప సారా’ అంశంపై అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇప్ప సారా వినియోగం, కల్తీ మద్యం నిరోధంపై జరిగిన చర్చ చివరకు రాజకీయ రంగు పులుముకుని సభలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇప్ప సారాను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు, దానికి పెట్టిన పేరుపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారంటూ ఆయన వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

**ఇప్ప సారా ఒక ‘ఆర్గానిక్ విస్కీ’**

 

చర్చలో భాగంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో కల్తీ కల్లు, అల్ఫజోలం కలిపిన మద్యం తాగి ప్రజల శరీరాలు శవాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికంటే అడవిలో సహజంగా దొరికే ఇప్ప పూలతో తయారుచేసే సారా అత్యంత సురక్షితమైనదని, దీనిని ‘ఆర్గానిక్ విస్కీ’గా పరిగణించవచ్చని పేర్కొన్నారు. దీనికి ‘ఇప్ప టకీలా’ అని గానీ, లేదా అనిరుధ్ రెడ్డి లాంటి మరేదైనా పేరు పెట్టుకోవాలని సూచించారు. అయితే, ప్రభుత్వం ప్రతి పథకానికి ‘ఇందిరమ్మ’ పేరు పెడుతున్న తరుణంలో, ఈ సారాకు మాత్రం ఆ పేరు పెట్టవద్దని ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి.

 

**మంత్రుల ఆగ్రహం.. క్షమాపణకు డిమాండ్**

 

రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబు ఒక్కసారిగా భగ్గుమన్నారు. “ఇందిరమ్మ మా దేవత.. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఉక్కు మహిళ. అటల్ బిహారీ వాజ్ పేయీ వంటి దిగ్గజాలే ఆమెను దుర్గామాతతో పోల్చారు. అలాంటి నాయకురాలి పేరును మద్యం అంశంతో ముడిపెట్టడం మీ సంస్కారమేనా?” అని నిలదీశారు. చనిపోయిన మహోన్నత నాయకురాలిని అవమానించేలా మాట్లాడటం సరికాదని, రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఒక మహిళా నాయకురాలి పట్ల బీజేపీకి ఉన్న గౌరవం ఇదేనా అని మంత్రి సీతక్క సూటిగా ప్రశ్నించారు.

 

**రికార్డుల నుంచి తొలగింపు**

 

శాసనసభలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెరగడంతో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రుల విజ్ఞప్తి మేరకు, సభ్యుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభ ప్రకటించింది. అయినప్పటికీ, ఒక సీనియర్ నాయకురాలిని మద్యం పేరుతో పోల్చడంపై కాంగ్రెస్ శ్రేణులు బయట కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై చర్చించాల్సిన సభ, చివరకు ‘ఇందిరమ్మ’ పేరు చుట్టూ సాగిన వివాదంతో వేడెక్కింది.

Latest