Mahaa Daily Exclusive

  ఎంతమందిని తొక్కుతావ్‌ నువ్వు..? రేవంత్‌రెడ్డికి జీవన్‌రెడ్డి సవాల్‌..

Share

  • ఎంతమందిని తొక్కుతావ్‌ నువ్వు?.
  •  అవమానాల పుట్ట.. ఆత్మగౌరవ పోరాటం.
  •  నీ చెప్పు చేతల్లో ఉండలేను.. ఎదిరించి పోరాడుతా.
  •  రేవంత్‌రెడ్డికి జీవన్‌రెడ్డి సవాల్‌

జగిత్యాల/హైదరాబాద్‌:మహా.

తెలంగాణ కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు వెన్నెముకలా నిలిచిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ఆ పార్టీకి తన 42 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు. బుధవారం జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ బహిరంగ సమావేశంలో ఆయన భావోద్వేగ పర్యంతమై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “ముఖ్యమంత్రి గారు.. ఈ పార్టీ నాది, నాకు అడ్డమొస్తే ఎవరినైనా తొక్కుతా అని అంటున్నావు.. అసలు ఎంతమందిని తొక్కుతావు నువ్వు? నీ తొక్కుడుకు భయపడే ప్రసక్తే లేదు” అంటూ జీవన్‌రెడ్డి నేరుగా ముఖ్యమంత్రికే యుద్ధ ప్రాతిపదికన సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ ధోరణిని ఎదిరించి పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పార్టీలో గత 20 నెలలుగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను జీవన్‌రెడ్డి సభ ముందు ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలు అనాథలుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వారు, ఆయన చెప్పుచేతల్లో ఉండేవారు మాత్రమే ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే తనలాంటి సీనియర్లను అణగదొక్కడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యంగా జగిత్యాలలో తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని, తన అనుచరుడైన గంగారెడ్డి హత్యకు గురైనా ముఖ్యమంత్రి కనీసం పరామర్శించకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్ వంటి కీలక స్థానాలను కోల్పోయిందని జీవన్‌రెడ్డి విశ్లేషించారు. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, ఇది పార్టీకి దీర్ఘకాలికంగా గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. “నిన్ను ఎదిరించి పోరాడితే పోయేదేముంది.. అణగదొక్కబడే దానికంటే పోరాడి చావడమే మిన్న” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. జగిత్యాల గడ్డ నినదిస్తే ఏ శక్తి కూడా ఆపలేదని, రేవంత్ రెడ్డి అహంకారానికి కాలమే సమాధానం చెబుతుందని జీవన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన తదుపరి అడుగు బీఆర్ఎస్ వైపా లేక స్వతంత్రంగా పోరాడతారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Latest