- పోలీసుల తూటాలకు ఇద్దరు నేరస్థులు చిత్తు.
ఢిల్లీ, మహా.
బిహార్‌లోని సివాన్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వేళ పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పులు ఉత్కంఠ రేపాయి. బసంత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాహేజీ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కరడుగట్టిన నేరస్థులు పోలీసుల తూటాలకు గాయపడ్డారు. వీరిలో ఒకరికి హైదరాబాద్‌లోని ప్రముఖ ఖజానా జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బధారియా సదర్‌పుర్‌కు చెందిన రోహిత్ శర్మతో పాటు తర్వారాకు చెందిన రోహిత్ అలియాస్ రిషు అనే ఇద్దరు నిందితులు ఆయుధాలతో లాహేజీ గ్రామ పరిసరాల్లో తిరుగుతున్నట్లు బసంత్‌పుర్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎస్‌హెచ్‌ఓ రాజ్ కుమార్ నేతృత్వంలో ఎస్సైలు జితేంద్ర కుమార్, సంజీవ్ కుమార్‌లతో కూడిన ప్రత్యేక బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. పోలీసుల రాకను గమనించిన నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో వారిపైకి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితుల కాళ్లకు తూటాలు తగలడంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
గాయపడిన నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని తొలుత సివాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భారీ భద్రత నడుమ పట్నాకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన రోహిత్ శర్మపై సివాన్ జిల్లా వ్యాప్తంగా అనేక ఆభరణాల దోపిడీ కేసులు ఉన్నాయని, కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఖజానా జ్యువెలరీలో జరిగిన దోపిడీలో కూడా ఇతడి హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ‘ఆపరేషన్ లంగ్డా’ పేరుతో నిర్వహించిన ఈ సాహసోపేతమైన దాడిలో నేరస్థులను పట్టుకున్న పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.








