- కుళ్లిపోయిన గుడ్లతో డోనట్ల తయారీ.
- మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ బాగోతం రట్టు.
- అపరిశుభ్ర అడ్డాలపై పోలీసుల మెరుపు దాడులు.
- మైలార్దేవ్పల్లిలో నకిలీ ఫుడ్ కంపెనీ గుట్టురట్టు.
హైదరాబాద్,మహా.
పసిపిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకులు, డోనట్ల తయారీలో సాగుతున్న వికృత దందా మైలార్దేవ్పల్లి పోలీసుల దాడుల్లో బయటపడింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీలో గల ప్లాట్ నెంబర్ 646లో ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో సాగుతున్న నకిలీ సామ్రాజ్యాన్ని పోలీసులు బుధవారం మట్టుబెట్టారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్సై విశ్వనాథ్ రెడ్డి తన బృందంతో కలిసి ఈ తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్కడ జరుగుతున్న అమానవీయ తయారీ విధానాన్ని చూసి విస్తుపోయారు.
కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఈ ముఠా, మార్కెట్లో పారవేసే కుళ్లిపోయిన కోడిగుడ్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటితో కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఎటువంటి ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఈ నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నిల్వ ఉన్న పదార్థాలకు కృత్రిమ మెరుపును, రుచిని అద్దేందుకు ప్రమాదకరమైన కెమికల్ పౌడర్లు, సింథటిక్ రంగులను ఇష్టానుసారంగా వాడుతున్నట్లు విచారణలో తేలింది. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా ద్వారా వందలాది కిలోల విషతుల్యమైన డోనట్లు ఇప్పటికే మార్కెట్లోకి సరఫరా అయినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్న అఫ్రిది అన్సారి, యాసిన్, ఖత్రేషన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఘటనా స్థలం నుంచి సుమారు 150 కేజీల డోనట్ కేక్స్, 120 కేజీల డాల్డా, 330 కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాటు 20 కేజీల బేకింగ్ పౌడర్, 25 కేజీల మిల్క్ పౌడర్ మరియు పెద్ద మొత్తంలో సింథటిక్ రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇటువంటి కల్తీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు బయట దొరికే రంగురంగుల ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.







