Mahaa Daily Exclusive

  ఖమ్మం జిల్లాలో కలకలం..! ముదిగొండలో సర్పంచ్ భర్త కిడ్నాప్..!

Share

  • వాకింగ్‌కు వెళ్లగా కారులో ఎత్తుకెళ్లిన దుండగులు.
  • మాజీ సర్పంచ్ అపహరణపై పోలీసుల ముమ్మర గాలింపు.
  •  సిల్వరాజు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో వేట.

ఖమ్మం, మహా.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పెను కలకలం రేగింది. ప్రస్తుత సర్పంచ్ పాము స్వర్ణలత భర్త, మాజీ సర్పంచ్ పాము సిల్వరాజును గుర్తుతెలియని దుండగులు కారులో అపహరించుకుపోవడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రతిరోజూ లాగే బుధవారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సిల్వరాజు, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో ఆరా తీయగా, కొందరు వ్యక్తులు ఆయనను కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, కారులో ఉన్నవారు ఆయనకు తెలిసిన వారేనని భావించి తాము పెద్దగా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం.

సిల్వరాజు గతంలో పండ్రేగుపల్లి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. రాజకీయంగా చురుగ్గా ఉండే వ్యక్తి కావడంతో ఈ కిడ్నాప్ వెనుక పాత కక్షలు ఉన్నాయా లేదా ఆర్థిక లావాదేవీల కోణం ఉందా అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. తన భర్త ఆచూకీ తెలియడం లేదని, ఎవరో దుండగులు ఆయనను అపహరించారని సర్పంచ్ స్వర్ణలత ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు.

జిల్లా సరిహద్దులు మరియు మండలంలోని అన్ని ప్రధాన రహదారులపై నిఘా పెట్టిన పోలీసులు, సీసీ టీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిల్వరాజు ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే బాధితుడిని సురక్షితంగా రక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

Latest