Mahaa Daily Exclusive

  మద్యం మత్తులో లావణ్య హల్‌చల్‌..!

Share

  • బైక్‌ను ఢీకొట్టి పరారయ్యే ప్రయత్నం!
  •  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు.
  • స్థానికులు, పోలీసులతో వాగ్వాదం.

సంగారెడ్డి/కొండాపూర్: మహా.

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారు. అతివేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా, అడ్డుకున్న స్థానికులు మరియు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి కలకలం రేపారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మల్లేపల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లావణ్య ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా ఆమె పరారయ్యే ప్రయత్నం చేయగా, అప్రమత్తమైన గ్రామస్థులు వెంబడించి కారును అడ్డుకున్నారు.

కారును ఆపిన స్థానికులు బాధితుడికి క్షమాపణ చెప్పాలని కోరగా, మద్యం మత్తులో ఉన్న లావణ్య వారిపైనే విరుచుకుపడ్డారు. వారితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు లోపల మద్యం సీసాలు ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, వారిని చూసి కూడా లావణ్య వెనక్కి తగ్గలేదు. పోలీసులతోనూ కాసేపు వాగ్వివాదానికి దిగి అక్కడ హంగామా సృష్టించారు.

దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఆమె మద్యం సేవించినట్లు (పాజిటివ్) తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసిన పోలీసులు, దానిని కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో వాహనం నడిపి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా, బాధ్యత లేకుండా ప్రవర్తించిన లావణ్య తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Latest