Mahaa Daily Exclusive

  ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్,..

Share

  • ధూళిపాళ్ల ఇంట పెళ్లి సందడి..!
  •  ‘పోటీకి సిద్ధమా?’.. లోకేశ్ చమత్కారం..
  •  ధూళిపాళ్ల రిటార్ట్.. వికసించిన నవ్వులు

గుంటూరు: మహా.

పొన్నూరు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల కలయికతో అత్యంత వైభవంగా సాగింది. గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన ధూళిపాళ్ల చిన్న కుమార్తె వైదీప్తి, రామ్ ల వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రి సహా హేమాహేమీలు హాజరై నవ వధువరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వేదిక వద్దకు చేరుకున్న ఆయనకు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

ఈ వివాహ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు, ఏపీ ఉపముఖ్యమంత్రి కలవడంతో ఆ ప్రాంతమంతా రాజకీయ కోలాహలం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లు పక్కపక్కనే కూర్చుని ఎంతో సాన్నిహిత్యంగా, సరదాగా ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేతలందరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు.

వివాహ వేదికపై నవవధువుతో మంత్రి నారా లోకేశ్ చేసిన సరదా సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది. నవవధువు వైదీప్తిని ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ.. త్వరలో మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని చమత్కరించారు. దీనికి పక్కనే ఉన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తక్షణమే స్పందిస్తూ.. “మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ” అని చమత్కారంగా బదులిచ్చారు. దీంతో పక్కనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సహా అతిథులందరూ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వధువరులకు శుభాకాంక్షలు తెలిపి, వారితో ఫోటోలు దిగారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ఆత్మీయ కలయికలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Latest