Mahaa Daily Exclusive

  విశ్వవేదికపై భారతీయ విద్యా ప్రభ..! ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్ ముందంజ..

Share

  • విశ్వవేదికపై భారతీయ విద్యా ప్రభ..
  • క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీల జోరు!
  •  టాప్-50లో 27 సబ్జెక్టులు..
  • విద్యా రంగంలో భారత్ సరికొత్త రికార్డు.
  • ఐఐటీల ఆధిపత్యం.. బిట్స్‌ పిలానీ సంచలనం.
  •  గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 99 వర్సిటీలు.
  •  ఇంజినీరింగ్, టెక్నాలజీలో మనమే సాటి..
  • ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్ ముందంజ.

హైదరాబాద్, మహా.

ప్రపంచ ఉన్నత విద్యా రంగంలో భారతీయ విశ్వవిద్యాలయాలు తమ సత్తాను మరోసారి చాటుకున్నాయి. ప్రతిష్ఠాత్మక ‘క్యూఎస్‌ (QS) క్వాక్వారెల్లి సైమండ్స్’ విడుదల చేసిన 2026 సబ్జెక్ట్ వారీ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది కేవలం విద్యా సంస్థల సంఖ్యలోనే కాకుండా, నాణ్యత పరంగా కూడా దేశం గణనీయమైన పురోగతిని సాధించడం విశేషం. మొత్తం 99 భారతీయ విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించగా, గత ఏడాది కంటే కొత్తగా 20 విద్యా సంస్థలు ఈ అంతర్జాతీయ వేదికపైకి రావడం భారత విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. సబ్జెక్టుల వారీగా చూస్తే భారత్ నుంచి 120 కొత్త ఎంట్రీలు నమోదయ్యాయి. ఈ విభాగంలో అమెరికా, చైనా, యుకే తర్వాత అత్యధిక ఎంట్రీలు సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.

ఐఐటీల ఆధిపత్యం ఈ ర్యాంకింగ్స్‌లో సుస్పష్టంగా కనిపిస్తోంది. ఐఐటీ బాంబే అత్యధిక సబ్జెక్ట్ ఎంట్రీలతో అగ్రస్థానంలో నిలవగా, ఐఐటీ ఖరగ్‌పుర్, దిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ సంస్థలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది భారత్‌కు చెందిన సబ్జెక్ట్ ఎంట్రీలలో దాదాపు సగం మెరుగైన స్థానాలు సాధించడం విశేషం. మొత్తం 265 ఎంట్రీలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకోగా, కేవలం 80 మాత్రమే స్వల్ప తగ్గుదలని చూశాయి. ఈ ఎదుగుదల వేగం యూఏఈ, యుకే, ఇండోనేషియా వంటి దేశాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారత్ తిరుగులేని వేగంతో దూసుకెళ్తోంది. గత ఐదేళ్లలో ఈ సబ్జెక్టులలో భారతీయ ఎంట్రీలు 65 శాతం పెరగడం దేశ సాంకేతిక విద్యా బలాన్ని చాటుతోంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో గత ఏడాది కేవలం రెండు సంస్థలు మాత్రమే టాప్ 100లో ఉండగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరడం విశేషం.

వ్యక్తిగత విద్యా సంస్థల ప్రదర్శనలో బిట్స్ (BITS) పిలాని అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ విభాగంలో గతంలో 84వ స్థానంలో ఉన్న ఈ సంస్థ, ఏకంగా 45వ ర్యాంకుకు చేరుకుని తొలిసారి టాప్ 50లో నిలిచింది. మొత్తం మీద భారత్ ఈ ఏడాది 27 టాప్ 50 స్థానాలను కైవసం చేసుకుంది. 2024లో ఈ సంఖ్య కేవలం 12 మాత్రమే ఉండటం గమనార్హం. ఐఐటీ అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, మార్కెటింగ్ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 21వ ర్యాంక్ సాధించగా, మార్కెటింగ్ విభాగంలో భారత్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించడం ఇదే తొలిసారి. అలాగే ఐఐటీ ధన్బాద్ మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్‌లో 21వ స్థానాన్ని దక్కించుకుంది.

మరోవైపు ఐఐటీ దిల్లీ ఈసారి అత్యుత్తమ సమగ్ర ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పాటు మొత్తం ఆరు సబ్జెక్టుల్లో ప్రపంచ టాప్ 50లో చోటు సంపాదించి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత విద్యా సంస్థల ఎదుగుదలపై క్యూఎస్ సీఈఓ జెస్సికా టర్నర్ స్పందిస్తూ, ఈ పురోగతి కేవలం సంఖ్యలకే పరిమితం కాలేదని, నాణ్యతలోనూ భారత్ ప్రపంచ స్థాయి పోటీని ఇస్తోందని కొనియాడారు. పరిశోధనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్తులో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ 2026 ఫలితాలు భారత ఉన్నత విద్యా వ్యవస్థ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందనే నిజానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి.

Latest