Mahaa Daily Exclusive

  నాడు రూ. 450 కోట్లు.. నేడు రూ. 16,500 కోట్లు: ఆర్‌సీబీ ప్రస్థానంపై విజయ్ మాల్యా భావోద్వేగం!

Share

నాడు విమర్శించారు.. నేడు 37 రెట్లు పెరిగింది.
* ఆర్‌సీబీ డీల్‌పై విజయ్‌ మాల్యా భావోద్వేగం
* 450 కోట్ల నుంచి 16,500 కోట్లకు.. ఆర్‌సీబీ ప్రస్థానంపై మాజీ బాస్‌ మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు.
బెంగళూరు,మహా.
ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ యాజమాన్య మార్పిడి క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. సుమారు 16,500 కోట్ల రూపాయల రికార్డు ధరకు ఈ జట్టు అమ్ముడైన నేపథ్యంలో, ఆర్‌సీబీ మాజీ యజమాని విజయ్‌ మాల్యా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తాను వేసిన అడుగు నేడు ఎంతటి మహావృక్షమైందో వివరిస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నాడు తాను పెట్టిన పెట్టుబడి నేడు 37 రెట్లు పెరగడంపై విజయ్‌ మాల్యా హర్షం వ్యక్తం చేశారు. 2008లో ఐపీఎల్‌ అంకురార్పణ జరిగిన సమయంలో తాను ఈ ఫ్రాంచైజీని కేవలం 450 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆనాడు ఒక క్రికెట్‌ జట్టుపై అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని చాలామంది తప్పుబట్టారని, తన నిర్ణయాన్ని చూసి నవ్వుకున్నారని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ఆడంబరం చాటుకోవడానికే ఈ జట్టును కొన్నానని విమర్శలు వచ్చాయని, కానీ తన ఆలోచనల వెనుక ‘రాయల్‌ ఛాలెంజ్’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే బలమైన సంకల్పం ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఈ జట్టుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని నామకరణం చేశానని వివరించారు.
తమ ప్రియతమ జట్టు విలువ నేడు 16,500 కోట్ల రూపాయలకు చేరడం పట్ల మాల్యా తన ఎక్స్‌ వేదికగా ఆర్‌సీబీ నూతన యజమానులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యంత విలువైన ఈ ఫ్రాంచైజీతో వారికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన జట్టు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆర్‌సీబీ తన డీఎన్‌ఏలో ఒక భాగమని మాల్యా పేర్కొన్నారు. ముఖ్యంగా కుర్రాడిగా ఉన్నప్పుడే విరాట్‌ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయడం తన జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకమని, నేడు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. తన హయాంలోనూ, ఆ తర్వాత కూడా జట్టుకు వెన్నంటి ఉన్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బెంగళూరు సింహం ఆర్‌సీబీకి మద్దతును ఇలాగే కొనసాగించాలని కోరారు.
మరోవైపు ఆర్‌సీబీ కొత్త యజమానులైన ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్ట్‌ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ కన్సార్టియం ఈ జట్టును దక్కించుకోవడంతో అభిమానుల్లో ఒక చిన్న ఆందోళన నెలకొంది. యాజమాన్యం మారింది కాబట్టి జట్టు పేరు మారుతుందేమోనన్న సందేహాలు తలెత్తాయి. అయితే దీనిపై ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అనన్య బిర్లా స్పష్టతనిచ్చారు. ఆర్‌సీబీ అనే పేరులో ఎలాంటి మార్పు ఉండదని, అదే పేరుతో జట్టు ప్రయాణం కొనసాగుతుందని హామీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన డీల్‌గా నమోదైన ఈ వ్యవహారం క్రికెట్‌ మార్కెట్‌ విలువను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Latest