కోటి ఎకరాల కన్నీరు..!
• ‘చీకటి’ జాబితాలో మాడిపోతున్న మాగాణి!
• దస్త్రాల కింద దహించుకుపోతున్న పచ్చని బతుకులు.
• పాలకుల ప్రయోగాలు.. బలిపీఠంపై అన్నదాతలు.
• లాగిన్‌ల చుట్టూ దశాబ్దాల ఆర్తనాదం.
• కళ్లెదుటే భూమి ఉన్నా కానరాని స్వేచ్ఛ.
• పోర్టళ్ల పేర్లు మారుతున్నా మారనంటున్న రెవెన్యూ అధికారుల తీరు.
**రాష్ట్రంలో భూముల నిషేధిత జాబితా అనే బ్రహ్మరాక్షసి కబంధ హస్తాల్లో చిక్కుకుని రైతాంగం నిలువునా దహించుకుపోతోంది. భూమిని నమ్ముకుని బతికే రైతుకు ఆ భూమే ఇప్పుడు ఉరితాడుగా మారుతోంది. రికార్డుల ప్రక్షాళన పేరిట అనాలోచితంగా లక్షలాది ఎకరాల రైతుల సొంత భూములను గుడ్డిగా 22-ఏ జాబితాలో పడేసిన రెవెన్యూ వ్యవస్థ.. ఇప్పుడు వారిని కక్షకట్టి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి ఎకరాల భూమి ఈ నిషేధిత పద్మవ్యూహంలో లాక్ అయిపోయిందంటే పాలనా వ్యవస్థలోని డొల్లత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. వ్యవస్థ చేసిన తప్పుకు ప్రాణాలు పణంగా పెట్టి శిక్ష అనుభవిస్తున్నది మాత్రం తెలంగాణ రైతాంగమే**
హైదరాబాద్, మహా ప్రత్యేకం.
తరతరాలుగా వస్తున్న పూర్వీకుల ఆస్తి.. రెక్కల కష్టంతో కొనుక్కున్న సొంత పొలం.. అందులో పగలూ రాత్రీ రక్తాన్ని చెమటగా మార్చి సాగు చేస్తున్నా, ఆ భూమిపై రైతుకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేకుండా పోయింది. తెలంగాణలో ఇప్పుడు 22-ఏ (నిషేధిత భూముల జాబితా) సెక్షన్ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతోంది. రాష్ట్రంలోని భూ రికార్డుల తాజా లెక్కలను లోతుగా విశ్లేషిస్తే గుండెలు పిండేసే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 2.50 కోట్ల ఎకరాల భూమి ఉండగా, అందులో ఎలాంటి వివాదాలు లేకుండా లావాదేవీలకు అందుబాటులో ఉన్నది కేవలం 1.53 కోట్ల ఎకరాలు మాత్రమే. మిగిలిన దాదాపు కోటి ఎకరాల భూమి ఏదో ఒక వివాదంతో నిషేధిత జాబితాలోనే నిక్షిప్తమై ఉండటం అత్యంత విషాదకరం. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్, అటవీ శాఖల భూములు సుమారు 77 లక్షల ఎకరాలు ఉండగా.. రైతుల పాలిట అసలు ఉరితాడుగా మారింది మాత్రం మరో 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూమే. ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న ఈ 18 లక్షల ఎకరాల భూమిని ‘పార్ట్-బీ’ పేరిట పెండింగ్‌లో పెట్టి, వారికి నేటికీ డిజిటల్ పాస్‌బుక్కులు జారీ చేయలేదు. దీనికి తోడు వ్యవసాయేతర అవసరాల కోసం కన్వర్ట్ చేసుకున్న (నాలా) మరో 3 లక్షల ఎకరాల భూమి కూడా అధికారుల నిర్లక్ష్యంతో ఈ జాబితాలోనే మగ్గిపోతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పోర్టళ్ల పేర్లు మారుతున్నాయి.. కానీ రైతుల తలరాత మాత్రం మారడం లేదు.
క్షేత్రస్థాయిలో జిల్లాల వారీగా పరిస్థితులను పరిశీలిస్తే అధికారుల ఏకపక్ష వైఖరి రైతుల పాలిట ఎంతటి శాపంగా మారిందో స్పష్టమవుతుంది. ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖల భూముల సరిహద్దుల నిర్ధారణలో రెవెన్యూ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. పక్కాగా పట్టా ఉన్న ప్రైవేటు పొలాలను సైతం అధికారులు అడ్డగోలుగా 22-ఏ జాబితాలో చేర్చేశారు. ఏ సర్వే నంబరులో దేవాదాయ లేదా వక్ఫ్ భూమి ఎంతుందో ఆయా శాఖలకే కనీస స్పష్టత లేదు. ఉదాహరణకు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక దేవాలయానికి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డెపల్లిలో 354 ఎకరాల భూమి ఉన్నదన్న పాత రికార్డుల సాకుతో.. 50 ఏళ్లుగా అక్కడ సాగు చేసుకుంటున్న వందలాది మంది పేద రైతుల భూములను రాత్రికి రాత్రే వివాదాల్లోకి నెట్టారు. జనగామ జిల్లాలోనే సుమారు 85 వేల ఎకరాల భూమికి మోక్షం లేకుండా పోయింది. రాజధాని శివారులో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో వేలాది ఎకరాలు 22-ఏ దారి పడుతున్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లిలో ఏకంగా రూ.27 వేల కోట్ల విలువైన 1800 ఎకరాల భూమిని ప్రభుత్వం ఒక్క కలం పోటుతో నిషేధిత జాబితాలో చేర్చడం వ్యవస్థాగత లోపాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గిరిజన రైతులు ఏళ్ల తరబడి దస్త్రాలు పట్టుకుని తహశీల్దార్ ఆఫీసుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు.
ఈ నిషేధిత ఉచ్చు అన్నదాతల ఆర్థిక మూలాలను పూర్తిగా ఛిద్రం చేస్తోంది. బిడ్డల పెళ్లిళ్ల కోసమో, ఇంట్లో వారి వైద్య ఖర్చుల కోసమో, లేదా పిల్లల ఉన్నత చదువుల కోసమో అత్యవసరంగా గుంట భూమి అమ్ముకుందామంటే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు కదలడం లేదు. కనీసం పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్లి పాస్ బుక్ చూపిద్దామంటే.. “మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రుణం ఇవ్వలేం” అంటూ బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా ముఖం మీదే తిరస్కరిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ లాగిన్‌లలో ఏళ్ల తరబడి లక్షలాది ఎకరాల దస్త్రాలు మూలుగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అధికారులు ఏదో ఒక కొత్త సాకు చెబుతూ, సాంకేతిక లోపాలను బూచిగా చూపుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. వేదికల మీద రైతుల పక్షపాతులమని చెప్పుకునే నాయకులు.. క్షేత్రస్థాయిలో వారికి వాస్తవ స్వేచ్ఛను ఇవ్వడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేవలం రాద్ధాంతం మాని, పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ఒక కచ్చితమైన కాలపరిమితిని విధించాలి. తప్పుల తడకగా ఉన్న రికార్డులను పక్కాగా ప్రక్షాళన చేసి, రైతుల పాలిట శాపంగా మారిన ఈ ‘నిషేధిత’ బ్రహ్మరాక్షసి నుంచి కర్షకులకు శాశ్వత విముక్తి కల్పించాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భూగర్భంలో రగులుతున్న ఈ కర్షక బడబాగ్ని రేపు పాలనా వ్యవస్థకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.







