* నయారా ఎనర్జీ భారీ బాదుడు.
* పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. సామాన్యుడిపై యుద్ధ సెగ!
* యుద్ధ సెగతో అల్లకల్లోలమైన ఇంధన మార్కెట్.
* ఒకవైపు నయారా పెంపు.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ఊరట.
ఢిల్లీ, మహా.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడంతో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ (Nayara Energy) కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల వల్ల వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు మరియు లీటర్ డీజిల్‌పై 3 రూపాయల మేర అదనపు భారం పడనుంది. ప్రైవేట్ ఇంధన సంస్థలు ముడి చమురును అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి రావడం మరియు ఆదాయంలో భారీ గ్యాప్ ఏర్పడటంతో ఈ ధరల పెంపు తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్ మరియు బీపీల సంయుక్త సంస్థ అయిన జియో-బీపీ కూడా ప్రస్తుతం భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, ధరల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, BPCL, HPCL మాత్రం ప్రస్తుతానికి సామాన్యుడికి పెద్ద ఊరటనిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు ధరలు పెంచుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రం చమురు ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇదే రీతిలో కొనసాగితే, భవిష్యత్తులో ప్రభుత్వ కంపెనీలు కూడా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధ వాతావరణం మరియు హర్మూజ్ జలసంధి మూసివేత ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపైనే భారత ఇంధన ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే పెరిగిన తరుణంలో, ఇంధన ధరల పెంపు సామాన్యుడి బడ్జెట్‌ను మరింత అస్తవ్యస్తం చేసే ప్రమాదం కనిపిస్తోంది.







