Mahaa Daily Exclusive

  దావోస్ పెట్టుబడులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం…

Share

* దావోస్ పెట్టుబడులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం.
* రాష్ట్రానికి రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు.
* 68 వేల మందికి పైగా ఉద్యోగాలు.
* ఐసోలేషన్‌లో ఉంటే పెట్టుబడులు రావు.
* పారదర్శకతకు తావులేదన్న శ్రీధర్ బాబు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రానికి దావోస్ పర్యటనల ద్వారా వచ్చిన పెట్టుబడులు మరియు కుదుర్చుకున్న ఒప్పందాల పై అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వివరణ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, స్వార్థ రాజకీయాల కోసం అబద్ధాలు ఆడటం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని ఆయన మండిపడ్డారు. తన శాఖలో పూర్తి పారదర్శకత ఉంటుందని, పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక ‘శ్వేతపత్రం’ విడుదల చేస్తుందని మంత్రి ప్రకటించారు. అవసరమైతే దీనిపై సభలో లఘు చర్చకు కూడా తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను మంత్రి గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. మొత్తం రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, వీటి ద్వారా సుమారు 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించబోతోందని ఆయన వెల్లడించారు. 2024 దావోస్ పర్యటనలో 18 ఒప్పందాల ద్వారా రూ. 40,232 కోట్లు రాగా, 2025 దావోస్ పర్యటనలో ఏకంగా 26 ఒప్పందాలతో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు. ఇప్పటికే రూ. 81,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఆరు కంపెనీలకు భూములు కేటాయించామని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1,540 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. మరో మూడు కంపెనీలకు సంబంధించి రూ. 30,000 కోట్ల పెట్టుబడుల కోసం భూములను గుర్తించామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచంతో అనుసంధానం కాకుండా కేవలం ఐసోలేషన్‌లో కూర్చుంటే పెట్టుబడులు రావని, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రంలోని వనరులను వివరించినప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని శ్రీధర్ బాబు విశ్లేషించారు. టైర్-2, టైర్-3 పట్టణాల్లో కూడా పారిశ్రామికాభివృద్ధిని విస్తరించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే పదేళ్ల తర్వాత నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చామని గుర్తు చేశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి, రైతు వేదికలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. నిజామాబాద్ ఐటీ టవర్‌లో ప్రస్తుతం 11 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, త్వరలోనే స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించబోతున్నామని మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.

Latest