Mahaa Daily Exclusive

  యుద్ధ మేఘాల నీడన భారత్….

Share

* యుద్ధ మేఘాల నీడన భారత్..
* రేపు ‘ముఖ్య’ మంత్రులతో మోదీ అత్యవసర భేటీ.
* ఇంధన సెగ.. సామాన్యుడికి గండం!
* పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రధాని సీరియస్.

ఢిల్లీ, మహా.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ , ఎల్పీజీ సరఫరాలో స్వల్ప అంతరాయాలు కనిపిస్తుండటం, ప్రైవేట్ సంస్థలు ధరలు పెంచడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించబోయే ముఖ్యమంత్రుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన నిల్వలను ఎలా నిర్వహించాలి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.
ఇటీవలే పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశంలో యుద్ధ భయాల తీవ్రతను అద్దం పడుతున్నాయి. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రజలు, ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆయన రాజ్యసభ సాక్షిగా పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, దౌత్య మార్గాల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు అటు అమెరికా, ఇటు ఇరాన్ , ఇజ్రాయెల్ దేశాల నాయకులతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో, దేశీయ భద్రత మరియు ఇంధన భద్రతపై రాజీ పడకూడదని కేంద్రం గట్టి నిశ్చయంతో ఉంది.
శుక్రవారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించబోతున్నారు. మొదటిది, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత. యుద్ధం ముదిరితే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్రాల సహకారం ఎంతైనా అవసరం. రెండవది, ఇంధన ధరల నియంత్రణ మరియు నిత్యావసర వస్తువుల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటం. మూడవది, అంతర్గత భద్రతపై నిఘా పెంచడం. యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని విద్రోహ శక్తులు దేశంలో అలజడి సృష్టించకుండా అప్రమత్తం చేయనున్నారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రాల అమలుపైనే ఆధారపడి ఉంటుందని భావిస్తున్న మోదీ, రేపటి భేటీలో సీఎంలందరినీ సమన్వయపరిచి ఒక ‘నేషనల్ యాక్షన్ ప్లాన్’ను ప్రకటించే అవకాశం ఉంది.

Latest