Mahaa Daily Exclusive

  విశాఖ తీరానికి ‘ఇంధన’ భరోసా..!

Share

యుద్ధం ముగింపు దశలో వరంలా చేరిన భారీ నౌకలు.

  •   విశాఖ పోర్టుకు ఎల్‌పీజీ, ఆయిల్ ట్యాంకర్లు.
  •   ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం.

విశాఖపట్టణం,మహా.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్న వేళ, భారతదేశానికి అత్యంత కీలకమైన ఎల్‌పీజీ , క్రూడ్ ఆయిల్ నిల్వలు విశాఖ పోర్టుకు చేరుకోవడం ఒక భారీ ఉపశమనం. విశాఖ తీరానికి చేరుకున్న భారీ ఎల్‌పీజీ నౌక ‘బిర్చ్’ ప్రస్తుతం హార్బర్ మౌత్‌లో లంగరేసింది. ఈ నౌక సుమారు 20,000 టన్నులకు పైగా గ్యాస్ నిల్వలను మోసుకొచ్చింది. గుజరాత్‌లోని వాయు మార్గాల ద్వారా కాకుండా, నౌకా మార్గంలో యుద్ధ క్షేత్రాన్ని దాటి ఈ నిల్వలు రావడం విశేషం. ఇప్పటికే ‘నందా దేవి’ వంటి భారీ నౌకల నుండి షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిల్వలను సేకరించిన ‘బిర్చ్’, ఇప్పుడు విశాఖ , తూర్పు తీర నగరాలకు గ్యాస్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

మరోవైపు, ముడి చమురు రవాణాలో కూడా విశాఖ పోర్టుకు భారీ ఊరట లభించింది. ‘ఎంటీ పెట్రాయిట్’ అనే భారీ చమురు నౌక ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుని చమురు నిల్వలను అన్‌లోడ్ చేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, గల్ఫ్ దేశాల నుండి అత్యంత సాహసోపేతంగా ఈ నౌకలు భారత తీరానికి చేరుకోవడం గమనార్హం. విశాఖపట్నంలో ఉన్న భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం ఇప్పటికే 1.33 మిలియన్ టన్నుల నిల్వలతో నిండుగా ఉండగా, ఇప్పుడు ఈ కొత్త నౌకల రాకతో ఇంధన భద్రత మరింత పటిష్టమైంది. ఈ నౌకలు మోసుకొచ్చిన నిల్వలు రాష్ట్రంలో కనీసం మరో రెండు వారాల పాటు ఎల్‌పీజీ మరియు పెట్రోల్ కొరత రాకుండా అడ్డుకోగలవని యంత్రాంగం అంచనా వేస్తోంది.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు , గృహ అవసరాలకు సరిపడా కమర్షియల్ ఎల్‌పీజీ కొరతతో అల్లాడుతున్న తరుణంలో ఈ నౌకల రాక ఒక పండగలాంటి వార్త. విశాఖపట్నం పోర్టు అధికారులు ఈ నౌకలకు ‘ప్రయారిటీ బెర్తింగ్’ కల్పించి, అత్యంత వేగంగా నిల్వలను పైపులైన్ల ద్వారా పంపిణీ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

Latest