Mahaa Daily Exclusive

  కడుపు చేతపట్టుకుని కూలికి పోతుంటే..! కాటికి పంపిన కాలయముడు: మార్కాపురం వద్ద అగ్నిప్రళయం..

Share

  •  కడుపు చేతపట్టుకుని కూలికి పోతుంటే..
  •   కాటికి పంపిన కాలయముడు: మార్కాపురం వద్ద అగ్నిప్రళయం..
  •   బస్సులో 14 మంది సజీవదహనం!
  •   ఐదు నెలల పసికందుపై మృత్యు పంజా..
  •   తండ్రి చేతుల్లోనే బూడిదైన ‘లియో’.
  •   గుండెల్ని పిండేస్తున్న మార్కాపురం మహా విషాదం!
  •   ఇతరులకు ఇళ్లు కట్టే సుతారీలు.. ఇప్పుడిక తిరిగిరాని లోకాలకు.
  •  కళ్లెదుటే ఆత్మీయులు కాలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత!
  •   నిద్రమత్తులో ఉండగానే నిప్పుల ఉప్పెన.
  •   గుర్తుపట్టలేనంతగా మారిన 14 మృతదేహాలు.
  •   మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రుల హాహాకారాలు.
  •  చీమకుర్తి టిప్పర్ మింగేసిన ప్రాణాలు.. శవాల దిబ్బగా మారిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు.
  •  ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

హైదరాబాద్, మహా.

 

**చీకటిని చీల్చుకుంటూ నెమ్మదిగా సాగుతున్న ఆ బస్సులో…అలసిపోయి నిద్రపోతున్న వారి కళ్లలో ఎన్నో కలలు. రేపు ఉదయం గమ్యం చేరాక, నాలుగు రాళ్లు సంపాదించి తమ కుటుంబాల అప్పులు తీర్చాలన్న తపన. కానీ, ఆ కలలన్నీ ఆ చీకట్లోనే బూడిదైపోయాయి. గమ్యం చేరకముందే మృత్యువు టిప్పర్ లారీ రూపంలో ఎదురొచ్చి వారి ఊపిరి తీసేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద గురువారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రెండు రాష్ట్రాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టిన క్షణాల్లోనే.. డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సంతా అగ్నికీలలు చుట్టుముట్టాయి. కళ్లు తెరిచి, ప్రాణాలు రక్షించుకునేలోపే 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోరకలిలో కాలిపోయిన ప్రతి మృతదేహం వెనుకా….గుండెల్ని పిండేసే ఒక కన్నీటి గాథ దాగి ఉంది**

 

**చితిగా మారిన బస్సు…శిథిలమైన బతుకులు**

 

తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా పామూరు వైపు బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన (AR20D0487) ప్రైవేటు బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు, సుతారీ పనివారు. తమ సొంత ఊర్లో పనులు దొరక్క, పొట్టకూటి కోసం ఆంధ్రాలోని కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పరుల కోసం అందమైన ఇళ్లు కట్టే ఆ అభాగ్యులు.. మంటల్లో చిక్కుకుని బూడిద కుప్పలుగా మారిపోవడం కలచివేస్తోంది.

ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకమైనది. మార్కాపురం సమీపంలో చీమకుర్తి నుంచి కంకర్ లోడుతో వస్తున్న టిప్పర్‌ను బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ముందు భాగం నుజ్జునుజ్జయి, డీజిల్ ట్యాంక్ పేలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలిసేలోపే బస్సంతా నిప్పుల కొలిమిగా మారింది. మంటల వేడికి, పొగకు ఊపిరి ఆడక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు ఆ అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టాయి. మంటలను గమనించిన ఓ 10 మంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ మిగిలిన వారిని ఆ రాక్షస మంటలు వదల్లేదు. కళ్లెదుటే తమ ఆత్మీయులు కాలిపోతున్నా.. అగ్నికీలల ధాటికి వారిని కాపాడుకోలేని నిస్సహాయతలో మిగిలిపోయిన వారి ఆర్తనాదాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి.

 

**కన్నీళ్లు తెప్పిస్తున్న పసికందు మరణం..ఆత్మీయుల శాశ్వత వీడ్కోలు**

 

ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారకమైన దృశ్యం ఐదు నెలల పసికందు అంబటి లియో మరణం. లోకం పోకడ తెలియని ఆ చిన్నారి.. తండ్రి అంబటి అనిల్ (26) చేతుల్లోనే అగ్నికి ఆహుతైపోయాడు. మంటలు అంటుకున్నప్పుడు తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తండ్రి పడిన తపన, చేసిన పోరాటం బహుశా ఆ దేవుడిని కూడా కదిలించి ఉండాలి. కానీ మంటల తీవ్రత ఆ తండ్రీకొడుకులను బూడిద చేసింది. వీరే కాకుండా బండారి పద్మ (28), ముత్తంగి వెంకటేశ్వర్లు (45), తమ్మశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ఎన్‌.ప్రభావతి (36), కత్తి జయరాములు, ఆత్మకోరు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి.. ఇలా మొత్తం 14 మంది నిండు ప్రాణాలు ఈ అగ్నిప్రళయంలో కలిసిపోయాయి.

కాలిపోయిన మృతదేహాలు ఏవి ఎవరివో గుర్తుపట్టలేనంత దారుణంగా మారిపోయాయి. ఎముకల గూళ్లుగా మారిన ఆ దేహాలను చూసి బంధువులు గుండెలు బాదుకుంటున్నారు. గాయపడిన మరో 28 మందిని హుటాహుటిన మూడు అగ్నిమాపక యంత్రాల సాయంతో కాపాడి, మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో చాలా మంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

 

**కదిలొచ్చిన యంత్రాంగం..అండగా నిలిచిన ప్రభుత్వాలు**

 

ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రులు నారా లోకేశ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఒక పూట గడిస్తే చాలనుకునే పేదల బతుకులపై పగిలిన ఈ మృత్యు పిడుగు.. ఆ కుటుంబాల్లో ఎన్నటికీ తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఇచ్చే లక్షల రూపాయల పరిహారం, ఆ కుటుంబాల్లో ఆరిపోయిన దీపాలను మళ్లీ వెలిగించలేవు. ఆత్మీయులను కోల్పోయిన ఆ కుటుంబాల రోదనలు ఎప్పటికీ ఆగిపోవు. రహదారులపై నెత్తుటి మరకలు, బూడిద కుప్పలుగా మారుతున్న బస్సులు.. రవాణా భద్రతపై ఇంకెన్ని ప్రశ్నలు సంధిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

Latest