- ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికి మోక్షం..
- డీపీఆర్ రూపకల్పనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- ఆర్‌ఆర్‌ఆర్ సౌత్ పార్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, రవాణా రంగానికి తలమానికంగా మారనున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు ఇప్పుడు ద్విముఖ వ్యూహంతో పరుగులు పెడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు కు ఆవల, సుమారు 340 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ప్రమాణాలతో రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) నిర్మించ తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టులో, నార్త్ పార్ట్ ఇప్పటికే కేంద్రం నుంచి మంజూరై టెండర్ల దశకు చేరుకుంది. అయితే, సౌత్ పార్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై ఇన్నాళ్లూ సందిగ్ధత నెలకొంది. ఈ నిరీక్షణకు తెరదించుతూ, దక్షిణ భాగానికి డీపీఆర్ తయారు చేయడానికి అధికారికంగా ఒక కన్సల్టెన్సీని నియమించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పష్టం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి, కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి రాష్ట్ర ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించిన నేపథ్యంతో కేంద్రం నుంచి ఈ సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. “దక్షిణ భాగానికి డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ మొదలైంది, కన్సల్టెన్సీ నియామకం కూడా పూర్తయింది” అని గడ్కరీ తన లేఖలో పేర్కొనడం ప్రాజెక్టు సాకారం దిశగా పడుతున్న బలమైన అడుగుగా చెప్పవచ్చు. కేంద్రం నుంచి వచ్చిన ఈ తీపికబురు పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ, నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర భాగం పనులు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో, దక్షిణ భాగం పట్ల కూడా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామమని ఆయన కొనియాడారు.
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల దశ, దిశ మారిపోనుంది. ప్రధానంగా సంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు, భారీ టౌన్‌షిప్‌ల విస్తరణకు ఈ రహదారి ఒక ‘గేమ్ చేంజర్’ కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.








