Mahaa Daily Exclusive

  విరాళాల ప్రవాహం.. కమలనాథులకే సింహభాగం..!

Share

  • విరాళాల ప్రవాహం.. కమలనాథులకే సింహభాగం.
  •  మిగతా పార్టీలన్నింటికంటే పదిరెట్లు అధికంగా బీజేపీకి ఫండ్స్!
  •  బీజేపీ ఖాతాలో ఏకంగా రూ. 6,074 కోట్లు.
  •  జాతీయ పార్టీల ఫండ్స్ 161 శాతం జంప్..కాంగ్రెస్‌కు దక్కింది కేవలం రూ. 517 కోట్లే!

ఢిల్లీ, మహా.

భారతదేశ రాజకీయాల్లో ఎన్నికల రణరంగాన్ని శాసించేది ప్రధానంగా నిధులే. ఏ పార్టీ దగ్గర ఎన్ని నిధులు ఉంటే, ఆ పార్టీ ప్రచారం అంత పటిష్టంగా ఉంటుంది. అయితే, దేశంలోని జాతీయ పార్టీలకు అందుతున్న విరాళాల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మకమానవు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 20 వేల పైబడి పార్టీలకు అందిన విరాళాల చిట్టాను ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ గురువారం ప్రజల ముందు ఉంచింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పార్టీల విరాళాలు ఏకంగా 161 శాతం పెరగడం ఒక ఎత్తైతే.. దేశంలోని ఇతర జాతీయ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన మొత్తం కంటే, అధికార బీజేపీ ఒక్కదానికే పదిరెట్లు అధికంగా విరాళాలు లభించడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

** కోట్లలో కురుస్తున్న కార్పొరేట్ కనకవర్షం**

 

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని జాతీయ పార్టీలకు కలిపి మొత్తం 11,343 విరాళాల ద్వారా ఏకంగా రూ. 6,648.563 కోట్లు సమకూరాయి. ఇందులో అధికార బీజేపీకి ఏ పార్టీ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. బీజేపీకి 5,522 విరాళాల ద్వారా అత్యధికంగా రూ. 6,074.015 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి 2,501 విరాళాల ద్వారా దక్కింది కేవలం రూ. 517.394 కోట్లు మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ , సీపీఐ-ఎం , నేషనల్ పీపుల్స్ పార్టీ లకు కలిపి వచ్చిన మొత్తం విరాళాల కంటే కూడా బీజేపీకి వచ్చిన విరాళాలు పది రెట్లు అధికంగా ఉండటం ఆ పార్టీ ఆర్థిక మూలాల బలానికి అద్దం పడుతోంది. ఇక మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ గత 19 ఏళ్లుగా అనుసరిస్తున్న ట్రెండ్‌నే కొనసాగిస్తూ, ఈసారి కూడా తమకు రూ. 20 వేల పైబడిన విరాళాలు ఏవీ రాలేదని ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే జాతీయ పార్టీల విరాళాల్లో ఏకంగా రూ. 4,104.285 కోట్ల మేర భారీ పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే బీజేపీ విరాళాలు రూ. 2,243.947 కోట్ల నుంచి ఏకంగా 171 శాతం మేర జంప్ అయ్యాయి. అటు కాంగ్రెస్ పార్టీ విరాళాలు కూడా రూ. 281.48 కోట్ల నుంచి 84 శాతం వృద్ధితో రూ. 517.394 కోట్లకు చేరుకున్నాయి. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి జాతీయ పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 244 శాతం వృద్ధితో రూ. 27.044 కోట్లు నిధులు సాధించగా, నేషనల్ పీపుల్స్ పార్టీ అనూహ్యంగా 1,313 శాతం వృద్ధితో రూ. 1.943 కోట్లు విరాళంగా పొందింది.

రాజకీయ పార్టీలకు అందుతున్న ఈ వేల కోట్ల నిధుల్లో ఆధిపత్యం అంతా కార్పొరేట్ సంస్థలదే కావడం విశేషం. మొత్తం విరాళాల్లో 92.18 శాతం కేవలం కార్పొరేట్ సంస్థల నుంచే వచ్చాయి. 3,244 కార్పొరేట్ విరాళాల ద్వారా రూ. 6,128.787 కోట్లు సమకూరగా.. 7,900 మంది వ్యక్తిగత దాతల నుంచి కేవలం 7.61 శాతం అనగా రూ. 505.66 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులోనూ కమలనాథులదే పైచేయి. బీజేపీకి 2,794 కార్పొరేట్ విరాళాల ద్వారా రూ. 5,717.167 కోట్లు వచ్చాయి. ఇది మిగతా జాతీయ పార్టీలన్నీ కలిపి పొందిన కార్పొరేట్ విరాళాల (రూ. 411.62 కోట్లు) కంటే ఏకంగా 13 రెట్లు ఎక్కువ కావడం విస్మయపరుస్తోంది. ఇక బీజేపీకి 2,627 మంది వ్యక్తుల నుంచి రూ. 345.94 కోట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 112 కార్పొరేట్ విరాళాల ద్వారా రూ. 383.86 కోట్లు, 2,357 మంది వ్యక్తుల ద్వారా రూ. 132.39 కోట్లు అందాయి.

అత్యధికంగా విరాళాలు ఇచ్చిన దాతల జాబితాను పరిశీలిస్తే ఎలక్టోరల్ ట్రస్ట్‌ల దే అగ్రస్థానం. ‘ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ అత్యధికంగా రూ. 2,413.465 కోట్లను బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లకు విరాళంగా ఇచ్చింది. ఇందులో బీజేపీకి రూ. 2,180.7119 కోట్లు (35.90%), కాంగ్రెస్‌కు రూ. 216.335 కోట్లు (41.81%), ఆప్‌కు రూ. 16.4178 కోట్లు (43.08%) అందాయి. ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్’ కేవలం రెండు విరాళాల ద్వారా రూ. 834.97 కోట్లు ఇవ్వగా, ‘ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్’ 16 విరాళాల ద్వారా రూ. 621 కోట్లు ఇచ్చింది. ‘న్యూ డెమొక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్’ ఏడు విరాళాల ద్వారా రూ. 155 కోట్లను బీజేపీ, కాంగ్రెస్‌లకు పంచింది. ఇక కార్పొరేట్ దిగ్గజాల విషయానికొస్తే.. కరోనా వ్యాక్సిన్‌తో వెలుగులోకి వచ్చిన ‘సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ మూడు విరాళాల ద్వారా రూ. 100 కోట్లను, ‘రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నాలుగు విరాళాల ద్వారా రూ. 95 కోట్లను అధికార బీజేపీకి విరాళంగా అందించాయని ఏడీఆర్ నివేదిక కుండబద్దలు కొట్టింది. నిధుల సమీకరణలో బీజేపీ వ్యూహం ముందు మిగతా పార్టీలు పూర్తిగా తేలిపోయాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Latest