Mahaa Daily Exclusive

  రూపాయి రికార్డు పతనం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..!

Share

  • రూపాయి రికార్డు పతనం..
  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.
  •  ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి.

ముంబై:మహా.

దేశీయ ఆర్థిక మార్కెట్లను వణుకు పుట్టిస్తూ భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 86 పైసలు క్షీణించి 94.82 వద్ద స్థిరపడింది. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఒకవైపు కరెన్సీ పతనం, మరోవైపు భగ్గుమంటున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యుద్ధ మేఘాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో దలాల్ స్ట్రీట్ భారీ అమ్మకాలతో అతలాకుతలమైంది.

స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టగా, ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,690 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో నిఫ్టీ సైతం కీలకమైన 23 వేల మార్కు కంటే దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. మార్కెట్ పతనంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.422 లక్షల కోట్లకు తగ్గింది. ఫలితంగా ఒక్క రోజే సుమారు రూ.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కర్పూరంలా ఆవిరైపోయింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ రంగ షేర్లు 3 శాతం మేర నష్టపోయి మార్కెట్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.

రంగాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. మార్కెట్ మొత్తం ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. ఓఎన్‌జీసీ, టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్ మరియు కోల్ ఇండియా షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే ముడిచమురు సెగ మరింత పెరిగి, రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు

Latest