Mahaa Daily Exclusive

  మహిళ సమ్మతితో లివ్-ఇన్ నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..!

Share

అలహాబాద్:మహా.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మేజర్ అయిన మహిళ తన ఇష్టపూర్వక సమ్మతితో ఒక వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటే.. ఆ వ్యక్తికి ఇప్పటికే వివాహమైనప్పటికీ, అది క్రిమినల్ నేరం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నైతికత, చట్టం అనేవి వేర్వేరు అంశాలని న్యాయస్థానం గుర్తుచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక జంట దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బాధిత మహిళ తల్లి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం.. సదరు మహిళకు 18 ఏళ్లు నిండాయని, ఆమె స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడిపై ప్రాథమికంగా ఎలాంటి నేరం కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఆ జంటను అరెస్టు చేయకుండా చూడాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, కుటుంబ సభ్యులు వారిని వేధించకూడదని గట్టిగా హెచ్చరించింది. ఫోన్ల ద్వారా గానీ, నేరుగా ఇంటికి వెళ్లడం లేదా ఇతర మార్గాల్లో సంప్రదించడం వంటి చర్యలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేసింది.

తమకు ప్రాణహాని ఉందని, ‘హానర్ కిల్లింగ్’ వంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఆ జంట కోర్టుకు విన్నవించడంతో.. వారి భద్రతా బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పగించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది.

Latest