- ఐరాసకు ఇరాన్ ఫిర్యాదు..
- అణు ముప్పుపై ఐఏఈఏ హెచ్చరిక.
న్యూయార్క్,మహా:
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్ సంచలన ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికపైకి వచ్చింది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి నేతలను అంతమొందించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా కుట్ర పన్నాయని ఇరాన్ నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చితో పాటు పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగెర్ ఘాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యాయత్న ప్రణాళికలు సాగుతున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు ఐరాసలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయ్యిద్ ఇరావని.. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ సమర్పించారు. యుద్ధం పేరుతో రాజకీయ నాయకత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్న శత్రు దేశాల తీరును ఆయన ఆ లేఖలో తీవ్రంగా ఎండగట్టారు. ఇరాన్ అధికారిక వార్తా ఛానళ్లు సైతం ఈ కుట్రకు సంబంధించిన కీలక అంశాలను ప్రసారం చేయడంతో అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
మరోవైపు యుద్ధం అణు ప్రమాదానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన సైనిక దాడులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్ ప్లాంట్ ఒక క్రియాశీలక అణు కేంద్రమని, అక్కడ అపారమైన యురేనియం నిల్వలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ పొరపాటున ఈ ప్లాంట్‌పై దాడి జరిగినా లేదా సాంకేతిక నష్టం వాటిల్లినా అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు కూడా విస్తరించి భారీ రేడియోధార్మిక విపత్తుగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధం ఎంత తీవ్రంగా సాగుతున్నప్పటికీ అణు భద్రత విషయంలో నిర్దేశించిన ఏడు ప్రాథమిక సూత్రాలను అన్ని దేశాలు ఖచ్చితంగా పాటించాలని గ్రాస్సీ విజ్ఞప్తి చేశారు.
యుద్ధం 28వ రోజుకు చేరుకున్నా శాంతి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఒకవైపు రాజకీయ హత్యల భయం, మరోవైపు అణు ప్రమాద హెచ్చరికల మధ్య పశ్చిమాసియా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లో చొచ్చుకువెళ్తుండగా, ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. అగ్రరాజ్యం అమెరికా దౌత్యపరంగా గడువు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపులు తగ్గకపోవడం పరిస్థితి మరింత జటిలం అవుతుందనడానికి నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఇరాన్ ఐరాసకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభంతో పాటు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న భయం దేశాధినేతలలో నెలకొంది







