హైదరాబాద్, మహా.
కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోని కీలక అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అగ్ర నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విడుదల చేశారు. ప్రతి రాష్ట్రానికి 40 మంది చొప్పున అగ్రనేతలతో కూడిన ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సముచిత స్థానం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రచార శైలిపై అధిష్ఠానం పూర్తి నమ్మకంతో ఉంది. దీంతో ఆయనను మూడు రాష్ట్రాలకూ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.
రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన మరికొంతమంది కీలక నేతలకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను సైతం ఈ మూడు రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలను ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు వివరించడంతో పాటు, ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో రాటుదేలిన ఈ నేతలు ప్రచార పర్వంలో కీలకం కానున్నారు. ముఖ్యంగా కేరళలో గణనీయమైన ప్రభావం చూపగల నేతగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం భావిస్తోంది.
ఈ నియామకాల ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాధాన్యం ఏఐసీసీలో మరింత పెరిగినట్లయింది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలో తమదైన ముద్ర వేసిన ఈ నేతలు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ తెలంగాణ నేతలు రంగంలోకి దిగుతుండటం పార్టీ కేడర్‌లో కొత్త జోష్ నింపుతోంది.







