- మేనేజర్ సహా 13 మంది అరెస్టు.
కరీంనగర్: మహా.
జిల్లా కేంద్రంలోని ఆర్‌బీఎల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణం నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నకిలీ ఖాతాలు సృష్టించి, ముఠా సభ్యులు మ్యూల్ ఖాతాల ద్వారా భారీ ఎత్తున నిధులను మళ్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో కేవలం సైబర్ నేరాలే కాకుండా, హవాలా లావాదేవీలు కూడా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి ఆర్బీఎల్ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు బ్యాంకుకు చెందిన పలువురు ఉద్యోగులను, ఇతర నిందితులను కలిపి మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం 7 మ్యూల్ ఖాతాల ద్వారానే దాదాపు రూ. 137 కోట్ల లావాదేవీలు జరిపి, ఆ నిధులను విదేశాలకు తరలించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో చైనాకు చెందిన వ్యక్తులతో కుమ్మక్కై బండారి సాయిరామ్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కుంభకోణం తీరుతెన్నులను వివరిస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కీలక వివరాలను వెల్లడించారు. బండారి సాయిరామ్ చైనాకు చెందిన నేరగాళ్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉండి, ఈ మ్యూల్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను చూసుకునేవాడు. ప్రతి లావాదేవీపై సాయిరామ్ 2 శాతం మేర కమీషన్ పొందుతుండగా, బ్యాంకు ఉద్యోగులు అతడికి సహకరించేవారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలతో ఖాతాలు తెరవడం, వాటి ద్వారా నిధుల మళ్లింపును చూసీచూడనట్లు వదిలేయడంలో మేనేజర్ స్థాయి అధికారులు సైతం పాలుపంచుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కేసులో విద్యావంతులైన డిప్లొమా, డిగ్రీ, చివరికి ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా నిందితులుగా ఉండటం నిరుద్యోగులు నేరాల బాట పడుతున్న తీరుకు అద్దం పడుతోంది.
మొత్తం ఎనిమిది వేర్వేరు కేసుల్లో ఈ 13 మందిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు మరియు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సామాన్య ప్రజల నుంచి సేకరించిన పత్రాలతో ఖాతాలు తెరిచి, ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులపై లోతైన విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులోని అంతర్గత భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని, సిబ్బంది అండదండలతోనే ఇంతటి భారీ మొత్తాన్ని మళ్లించగలిగారని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో బ్యాంకు ఖాతాదారులలో ఆందోళన నెలకొంది.







