- ఇద్దరి అరెస్టు.. రూ. 6 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం.
హైదరాబాద్: మహా.
భాగ్యనగరంలో మత్తు పదార్థాల విక్రయాలు మరోసారి కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 60 గ్రాముల ఎండీఎంఏ రకానికి చెందిన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసులో ప్రధాన సరఫరాదారులుగా భావిస్తున్న సాయినిఖిల్ యాదవ్, ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టుబడిన నిందితులకు మొదటి నుంచి మద్యం, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన అలవాటు ఉందని, ఆ వ్యసనాల కోసం డబ్బులు సరిపోక చివరకు డ్రగ్స్ విక్రేతలుగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు, ఈ ముఠాకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.







