Mahaa Daily Exclusive

  తుంగభద్రలో పెళ్లి బృందం విషాదం..! నలుగురు జలసమాధి..

Share

కర్నూలు,మహా.

బంధువుల పెళ్లికి వచ్చి సరదాగా గడుపుదామని తుంగభద్ర నదికి వెళ్లిన ఆ కుటుంబాల్లో పెను విషాదం నిండింది. నదిలో స్నానానికి దిగి నీటి ఉధృతిని అంచనా వేయలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటంతో ఆ ప్రాంతమంతా కన్నీరుమున్నీరవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మాన్వి పరిధిలోని కురిడి గ్రామానికి చెందిన సుమారు 15 మంది బంధువులు కందుకూరులో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. గురువారం పెళ్లి వేడుకలు ఘనంగా ముగియడంతో, శుక్రవారం ఉదయం వారంతా కలిసి తుంగభద్ర నదిలో స్నానాలు చేసేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకున్నారు. నదిలో సరదాగా స్నానం చేస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరికి ఈత రాకపోవడం, అదే సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన మిగిలిన వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కురిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. శుభకార్యానికి వచ్చి ఇలా విగతజీవులుగా మారడంతో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Latest