* మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టు.
* పీఠమెక్కిన మరుసటి రోజే కఠిన చర్యలు ప్రారంభించిన బలేంద్ర షా సర్కార్.
నేపాల్, మహా.
నేపాల్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా చక్రం తిప్పిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అనూహ్య రీతిలో కటకటాల పాలయ్యారు. గతేడాది దేశాన్ని కుదిపేసిన ‘జెన్ జీ’ నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసాకాండ, పౌరుల మరణాలకు సంబంధించి ఆయనపై ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకుంది. ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగి, సంచలనం సృష్టించిన బలేంద్ర షా కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఓలీతో పాటు అప్పటి హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని ఖాట్మండు వ్యాలీ పోలీస్ ప్రతినిధి ఓం అధికారి స్పష్టం చేశారు.
ఈ అరెస్టులపై నేపాల్ వర్తమాన హోం మంత్రి సుదన్ గురుంగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యను కేవలం రాజకీయ కక్షసాధింపుగా చూడకూడదని, అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా వేసిన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. దేశం ఇకపై కొత్త పంథాలో, పారదర్శకమైన పాలన దిశగా పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గతేడాది సెప్టెంబర్ నెలలో అవినీతికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ‘జెన్ జీ’ నిరసనలు నేపాల్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో సుమారు 70 మందికి పైగా సామాన్య పౌరులు బలయ్యారు. ఆ రక్తపాతానికి నైతిక బాధ్యత వహిస్తూనే అప్పట్లో ఓలీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలపై గతంలో నియమించిన విచారణ కమిషన్ తన నివేదికలో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైనందుకు ఓలీ, లేఖక్‌లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే నివేదిక అమలుకు పచ్చజెండా ఊపిన బలేంద్ర షా ప్రభుత్వం, వెనువెంటనే అరెస్టులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.







