Mahaa Daily Exclusive

  వాహనదారులకు ఇక తిప్పలు తప్పినట్టే…..

Share

*నేరుగా ఇంటికే ఆర్సీ, లైసెన్స్‌ కార్డులు.
* జాప్యానికి చెక్ పెడుతూ ‘సెంట్రలైజ్డ్‌’ విధానానికి శ్రీకారం.
* సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని వాహనదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల కోసం ఎదురుచూసే కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియలో నెలకొంటున్న నెలల తరబడి జాప్యాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న సంస్కరణకు సంబంధించి రవాణా శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పచ్చజెండా ఊపారు. దీనివల్ల కార్డుల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగనుంది.
ప్రస్తుత విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 ఆర్టీఏ కార్యాలయాల్లో విడివిడిగా కార్డుల ముద్రణ జరుగుతోంది. ప్రతి ఏటా సుమారు 15 లక్షల కార్డులను జారీ చేయాల్సి ఉండగా, సరైన సమయానికి కార్డులు అందక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న నెలల తర్వాత కూడా కార్డులు చేతికి రాకపోవడంతో, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఏజెంట్ల వద్ద వందల సంఖ్యలో కార్డులు లభ్యమవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టి, అర్హులైన వారికే నేరుగా కార్డులు అందాలన్న సంకల్పంతో ఈ కేంద్రీకృత విధానాన్ని పట్టాలెక్కిస్తున్నారు.
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దరఖాస్తులను ఒకే కేంద్రం నుంచి ముద్రించి, నేరుగా దరఖాస్తుదారుడి చిరునామాకే పోస్టు ద్వారా పంపిస్తారు. దీనివల్ల వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కార్డులు అందలేదంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం, మళ్లీ డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సమస్యలు ఇకపై తలెత్తవు. మరోవైపు రవాణా శాఖకు యూజర్ ఛార్జీల రూపంలో ఏటా వస్తున్న రూ.135 కోట్ల నిధులను అదే శాఖకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ నిధులతో రవాణా శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ప్రజలకు అందించే సేవలను మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించే అవకాశం కలుగుతుంది.

Latest