హైదరాబాద్, మహా.
ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో అమాయక ప్రజల నుంచి భారీగా నగదు కొల్లగొడుతున్న ఒక హైటెక్ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఉదంతాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో తిష్టవేసి, నకిలీ వెబ్‌సైట్లతో మాయమాటలు చెప్పి ఏకంగా రూ. 26 కోట్లకు పైగా స్వాహా చేసిన ఈ ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రాజేశ్ వెంకటరామన్, ఉప్పల్ వాసి భమిడిపాటి అభిషేక్, గోవాకు చెందిన వెబ్ డిజైనర్ మన్మీత్ శర్మ, కేరళకు చెందిన అగస్టీస్ విలియమ్స్ కలిసి ఈ దందాకు తెరలేపారు. వీరికి గుజరాత్, దిల్లీకి చెందిన మరికొందరు సహకరించేవారు.
**నకిలీ వెబ్‌సైట్‌తో గాలం.. వర్చువల్ లాభాలతో మాయ**
ఈ ముఠా ‘వైవన్ గేమ్’ పేరుతో ఒక నకిలీ గేమింగ్ వెబ్‌సైట్‌ను సృష్టించి, ప్రజలను ఆకర్షించేలా సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసేవారు. ఈ వెబ్‌సైట్‌ను నమ్మి ఎవరైనా డబ్బు చెల్లించి గేమ్స్ ఆడితే, వారికి భారీగా లాభాలు వచ్చినట్లుగా స్క్రీన్‌పై వర్చువల్ అంకెలను చూపించేవారు. ఆ లాభాలను చూసి బాధితులు మరింత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టేవారు. అయితే, వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం నిందితులు సాంకేతిక కారణాలు చెప్తూ నిరాకరించేవారు. దిల్లీకి చెందిన ఆండీ అలియాస్ సమీర్ అనే వ్యక్తి నకిలీ కంపెనీల పేర్లతో కేవైసీ పత్రాలను సృష్టించి బ్యాంకు ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతాల వివరాలను గుజరాత్‌లోని సూర్యోదయ బ్యాంకు అధికారులకు పంపి, నిందితులు పేమెంట్ గేట్‌వే సేవలను పొంది బాధితుల సొమ్మును మళ్లించేవారు.
**రూ. 30 లక్షలు పోగొట్టుకున్న యువతి…దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు**
హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఈ గేమింగ్ ప్రకటనను నమ్మి ఏకంగా రూ. 30 లక్షలు పోగొట్టుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ శివచంద్ర బృందం సాంకేతిక ఆధారాలను విశ్లేషించింది. నిందితుల మధ్య జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించగా, ఇప్పటివరకు సుమారు రూ. 26.07 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేలింది. వసూలైన సొమ్ములో ప్రధాన నిందితులు చెరో 5 శాతం కమీషన్ తీసుకోగా, మిగిలిన మొత్తాన్ని నెట్‌వర్క్ నిర్వహణకు మరియు ఇతర నిందితుల ఖాతాలకు బదిలీ చేసేవారు. పక్కా సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
** వీటిపై కన్నేసి ఉంచండి**
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పెరుగుతున్న మోసాల దృష్ట్యా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఏ ఆట ఆడాలన్నా కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక వేదికల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలని, థర్డ్-పార్టీ లింకులను నమ్మవద్దని హెచ్చరించారు. ఉచిత కాయిన్లు లేదా భారీ తగ్గింపుల పేరుతో వచ్చే ఈమెయిల్స్, మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గేమ్ ఆడే సమయంలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు లేదా పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ పంచుకోవద్దని కోరారు. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా భద్రతా లోపాలను నివారించవచ్చని, ఏదైనా కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఇతర యూజర్ల రివ్యూలను తప్పనిసరిగా చదవాలని పోలీసులు స్పష్టం చేశారు.







