నైనితాల్,మహా.
ఉచితంగా చికెన్ ఇవ్వలేదన్న కోపంతో విద్యుత్ శాఖ సిబ్బంది తనపై కక్షగట్టారని, కేవలం రెండు బల్బులు ఉన్న తన ఇంటికి ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారని ఓ పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆరోపించడం కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లా రాం నగర్ పరిధిలో మాల్ధన్ చౌర్ గ్రామానికి చెందిన జైపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ వింత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తన పౌల్ట్రీ ఫామ్ ముందు భాగంలో, నివాసం వెనుక భాగంలో ఉంటుందని.. రెండు చోట్లా విద్యుత్ వాడుతున్నప్పటికీ బిల్లులు సక్రమంగానే చెల్లిస్తున్నానని ఆయన వాపోయారు. అయితే, కొద్దిరోజుల క్రితం తన వద్దకు వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బంది 15 కిలోల చికెన్ ఉచితంగా ఇవ్వాలని అడిగారని, అందుకు తాను నిరాకరించడమే ఈ భారీ జరిమానాకు కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
**బిల్లులు చింపేసి.. బెదిరించి..**
జైపాల్ సింగ్ భార్య నర్మా దేవి కథనం ప్రకారం.. విద్యుత్ శాఖ నిఘా బృందం తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో చాలా దురుసుగా ప్రవర్తించింది. తాము గత బిల్లులు చూపిస్తామన్నా వినకుండా, తమ వద్ద ఉన్న బిల్లులను చింపివేసి పోలీస్ స్టేషన్‌కు పంపిస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. తమ ఇంట్లో కేవలం రెండు బల్బులు తప్ప కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలు ఏవీ లేవని, చివరికి వాటర్ మోటార్ కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. పొరుగున ఉండే సీతాదేవి అనే మహిళ కూడా జైపాల్ కుటుంబానికి తమ ఇంటి నుంచే నీటి కనెక్షన్ ఇస్తున్నట్లు ధ్రువీకరించారు. ఇన్ని ఆధారాలు ఉన్నా, పాత కక్షతోనే మీటర్ ట్యాంపరింగ్ నెపం మోపి రూ. 2 లక్షల జరిమానా వేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.
**అక్రమ కనెక్షన్ అని అధికారులు స్పష్టీకరణ**
ఈ ఆరోపణలపై విద్యుత్ శాఖ జేఈ మతిమ్ ఖాన్ స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. హల్ద్వానీ నుంచి వచ్చిన నిఘా బృందం జరిపిన సోదాల్లో జైపాల్ ఇంట్లో అనధికారిక కనెక్షన్ గుర్తించామని ఆయన తెలిపారు. జైపాల్ భార్య పేరిట ఉన్న కనెక్షన్ వాస్తవానికి మరో ప్రాంతానికి చెందినదని, దానిని ఇక్కడ అక్రమంగా వాడుతున్నట్లు గుర్తించామన్నారు. గతంలో మీటర్ అమర్చడానికి వెళ్లినప్పుడు ఆ కుటుంబం సహకరించలేదని, అందుకే ఈసారి సోదాల సమయంలోనే కొత్త మీటర్ ఏర్పాటు చేసి బకాయిలు, అక్రమ వినియోగం ప్రాతిపదికన జరిమానా విధించామని స్పష్టం చేశారు. తమ సోదాలకు సంబంధించిన పూర్తి వీడియో రికార్డింగ్ తమ వద్ద ఉందని, దానిని కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, వ్యక్తిగత ఆరోపణల్లో నిజం లేదని శాఖా పరంగా వెల్లడించారు







